ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. నేడు (జనవరి 31) ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగిన విషయం తెలిసిందే. ఈ కేబినెట్ భేటీలో ఉద్యోగాల భర్తీతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశంలో.. ఏపీ డీఎస్సీ నిర్వహణ, నోటిఫికేషన్ల విడుదలపై చర్చించారు.. మొత్తం 6100 టీచర్ పోస్టుల భర్తీకి ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఆమోదం తెలిపింది. అలాగే.. అటవీశాఖలో 689 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదించింది.. ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్లు సహా వివిధ పోస్టుల భర్తీ చేయనున్నారు.
వైద్యారోగ్య శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొత్త పథకాల ఆమోదం కోసం భేటీ అవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రైతు భరోసా, సున్నా వడ్డీ, ఇన్ ఫుట్ సబ్సిడీ, పంట బీమా కలిపి నాలుగు వేల కోట్ల బకాయిలు అక్టోబర్ నెలల్లో చెల్లిస్తామని ప్రకటించారు. ‘ఉద్యోగులకు కొత్త పీఆర్సీ వచ్చే లోపు ఐఆర్ అంశం. డీఎస్సీ నోటిఫికేషన్. అసెంబ్లీ సమావేశాలు, జగనన్న కాలనీలు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం‘ తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
ఇంకా.. ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ సెక్రటరీ ఉండాలన్న నిర్ణయానికి ఆమోదం తెలిపారు. ఎస్‌ఈఆర్‌టీలోకి ఐబీ భాగస్వామ్యానికి కేబినెట్ ఆమోదం.. యూనివర్శిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయసు 60 నుంచి 62కు పెంపు తదితర అంశాలపై చర్చించారు. మరోవైపు ఇంధన రంగంలో రూ.22 వేల కోట్లకు పైగా పెట్టుబడుల ప్రతిపాదనలకు కూడా మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఇంధన రంగంలో రూ.22,302 కోట్ల పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా 5,300 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు.