ప్రస్తుత రోజుల్లో డబ్బు అవసరం పడితే చాలా మంది తెలిసిన వాళ్ల దగ్గర అడుగుతుంటారు. అదే పెద్ద మొత్తంలో కావాలంటే.. ఏం చేస్తారు. అప్పుగా కూడా దొరకకుంటే చాలా మంది దగ్గర ఉండే ఆప్షన్.. బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకోవడమే. పర్సనల్ లోన్ తీసుకునే ముందు అందరూ ఏ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయనేది తెలుసుకోవాలి. తీసుకునే నగదును బట్టి.. క్రెడిట్ స్కోరును బట్టి.. మీ ఆదాయాన్ని బట్టి.. వడ్డీ రేట్లు ఒక్కో బ్యాంకులో ఒక్కోలా ఉంటాయని చెప్పొచ్చు. సాధారణంగా క్రెడిట్ స్కోరు ఎక్కువ ఉంటే.. వడ్డీ రేటు తక్కువ పడుతుంది. మరి ఇప్పుటు తక్కువ వడ్డీతో వ్యక్తిగత రుణం అందించే టాప్ బ్యాంకుల లిస్ట్ చూద్దాం.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్..
ప్రైవేట్ రంగానికి చెందిన అతి పెద్ద బ్యాంక్.. HDFC బ్యాంక్ లోన్లపై 10.75 శాతం నుంచి గరిష్టంగా 24 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తుంది. ప్రాసెసింగ్ ఫీజు రూ. 4999 ప్లస్ జీఎస్టీగా ఉంది. లోన్ టెన్యూర్ 3 నెలల నుంచి 72 నెలలుగా ఉంది. గరిష్టంగా రూ. 40 లక్షల వరకు లోన్ ఇస్తుంది.
ఐసీఐసీఐ బ్యాంకు..
ప్రైవేట్ రంగానికి చెందిన రెండో అతిపెద్ద బ్యాంకు.. ఐసీఐసీఐ లోన్లపై 10.65 శాతం నుంచి 16 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తోంది. ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తంలో 2.50 శాతం ప్లస్ జీఎస్టీగా ఉంటుంది.
ఎస్బీఐ..
అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (SBI) 11.15 శాతం నుంచి వడ్డీ రేటు స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాంకు గరిష్టంగా రూ. 20 లక్షల వరకు పర్సనల్ లోన్ ఆఫర్ చేస్తుంది. ఎస్‌బీఐలో బ్యాంక్ అకౌంట్ లేకున్నా లోన్లు అందిస్తుంది.
కోటక్ మహీంద్రా బ్యాంకు..
ప్రైవేట్ రంగానికి చెందిన కోటక్ మహీంద్రా బ్యాంకు.. రూ. 50 వేల నుంచి రూ. 40 లక్షల వరకు వ్యక్తిగత రుణం ఆఫర్ చేస్తుంది. దీంట్లో వడ్డీ రేట్లు 10.99 శాతం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ప్రాసెసింగ్ ఫీజు ఇక్కడ చూసుకుండే లోన్ మొత్తంలో 3 శాతం ప్లస్ జీఎస్టీ ఉంటుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్..
ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన పీఎన్‌బీ కార్పొరేట్ ఉద్యోగులకు వారి క్రెడిట్ స్కోరును బట్టి పర్సనల్ లోన్లపై 12.75 శాతం నుంచి 16.25 శాతం వరకు వడ్డీ విధిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు 11.75 శాతం వడ్డీకి లోన్లు ఇస్తుంది. డిఫెన్స్ పర్సనల్‌కు ఇంకా తక్కువగా 11.40 శాతానికి లోన్లు మంజూరు చేస్తుంది.