ఏపీపీఎస్సీ గ్రూప్-2 ఎగ్జామ్ హాల్‌టికెట్లు ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. 897 గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి ఈనెల 25న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కోసం 24 జిల్లా కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్‌టికెట్లు విడుదలయ్యాక ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in/ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల గ్రూప్-2 నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష తేదీలో ఎలాంటి మార్పులేదని.. నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగానే.. ఫిబ్రవరి 25వ తేదీనేఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తామని ఇప్పటికే ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఈ పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ గ్రూప్-2 పరీక్షకు 4.83 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఇక.. స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా గ్రూప్-2 అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తాజా నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 897 గ్రూప్-2 పోస్టుల భర్తీ చేయనున్నారు. ఇందులో.. 331 ఎగ్జిక్యూటివ్, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలున్నాయి. డిసెంబర్ 21వ తేదీ నుంచి జనవరి 17వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. అయితే.. మెయిన్స్ పరీక్ష తేదీని త్వరలో ప్రకటించనున్నారు.
గ్రూప్-1 పరీక్ష విధానం:
ప్రిలిమ్స్ పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో ఆఫ్‌లైన్ విధానంలో ఉంటుంది. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీలో 150 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు 2.30 గంటల్లో ఓఎంఆర్ షీట్‌పై సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. ఇక.. మెయిన్స్ పరీక్షలో పేపర్-1, పేపర్-2లో 150 చొప్పున ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు జవాబులు గుర్తించాల్సి ఉంటుంది. ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఏపీపీఎస్సీ నిర్ణయించిన నిష్పత్తి ఆధారంగా మెయిన్ పరీక్షకు షార్ట్‌లిస్ట్ చేస్తారు. మెయిన్ రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా.. అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష నిర్వహిస్తారు. అయితే.. స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామ్ రెండూ ఆఫ్‌లైన్ మోడ్ (ఓఎంఆర్) ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. నూతన సిలబస్, నూతన నియామక ప్రక్రియలో ఈసారి ఏపీపీఎస్సీ గ్రూప్-2 పోస్టులను భర్తీ చేయనున్నారు.