టెక్ దిగ్గజం గూగుల్‌కు చెందిన జీమెయిల్‌ను మూసేస్తారంటూ సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఊహాగానాలన్నింటికి తాజాగా గూగుల్ తెరదించింది. ఎప్పటిలానే సేవలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా ఇవే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గూగుల్ జీమెయిల్ షట్‌డౌన్‌కు సంబంధించి ఒక స్క్రీన్ షాట్ కూడా తెగ వైరల్ అయింది. ఆగస్ట్ 1న జీమెయిల్ సర్వీసుకు ముగింపు అని స్క్రీన్ షాట్‌లో ఉంది. ఆగస్టు ఒకటి తర్వాత ఇమెయిల్స్ పంపించడం, స్వీకరించడం కుదరదని, స్టోర్ చేసుకోవడం కూడా వీలు కాదని అందులో ఉంది. దీంతో జీమెయిల్ యూజర్లలో సందేహాలు, అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
జీమెయిల్ సర్వీసుల్ని మూసివేస్తారంటూ ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ (ఎక్స్), టిక్‌టాక్‌ల్లో వైరల్‌గా మారగా.. జీమెయిల్ యూజర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే గూగుల్ స్వయంగా దీనిపై స్పందించింది. అది ఫేక్ న్యూస్ అని.. తమ జీమెయిల్ సేవలు యథాతథంగా కొనసాగుతూనే ఉంటాయని స్పష్టతనిచ్చింది.
ఈ ఊహాగానాలపై స్పందించిన గూగుల్.. జీమెయిల్ అఫీషియల్ ఎక్స్ ఖాతా నుంచే ఈ సేవలు కొనసాగుతాయని పోస్ట్ పెట్టింది. దీంతో సోషల్ మీడియాలో జరుగుతున్న అబద్ధపు ప్రచారానికి చెక్ పడినట్లయింది. ఈ ప్రచారంపై టెక్ నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రకటనల్ని ఆదిలోనే అంతం చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. వాస్తవానికి ఈ సంవత్సరం జనవరి నుంచి జీమెయిల్ తన HMTL వెర్షన్ సర్వీసుల్ని మాత్రమే నిలిపి వేసింది. నెట్‌వర్క్ సరిగా లేని సమయంలో కూడా ఇ-మెయిల్స్ పొందడం ఇలాంటి సర్వీసుల ఉద్దేశం. రెగ్యులర్ ఇ-మెయిల్ సేవలకు ఎలాంటి ఇబ్బందులు లేవని.. ఇవి కొనసాగుతాయని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.