ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాలో జాబ్ వదిలేసి స్టార్టప్ పెట్టింది.. మూడేళ్లకే రూ. 100 కోట్ల టర్నోవర్.. అహానా గౌతమ్ సక్సెస్ స్టోరీ

business |  Suryaa Desk  | Published : Sat, Feb 24, 2024, 10:39 PM

కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అన్నాడో కవి. నిజంగానే మనం ఏదైనా కష్టపడి పనిచేస్తే విజయం దానంతటదే వస్తుందని చాలా మంది చెబుతుంటారు. ఏదైనా పని చేయాలనుకొని.. దాని కోసం పూర్తిగా కష్టపడితే కచ్చితంగా విజయం సాధించవచ్చు. చాలా మంది చదువు పూర్తయ్యాక మంచి ఉద్యోగం సాధించాలని కలలుగంటారు. విదేశాల్లో మంచి ఉద్యోగం.. మంచి శాలరీ ఉంటే ఎవరైనా వదులుకోవాలనుకుంటారా? అయితే చాలా మంది పెద్ద పెద్ద ప్యాకేజీల్ని వదులుకొని.. చిన్న చిన్న ఆలోచనలతో స్టార్టప్స్ ప్రారంభించిన వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే అహానా గౌతమ్ కూడా అదే కోవలోకి వస్తుంది.


రాజస్థాన్ భరత్‌పూర్ వాసి అయిన ఈమె అమెరికాలో మంచి ఉద్యోగం వదిలేసి స్వయంగా తానే ఒక స్టార్టప్ ప్రారంభించింది. ఆ కంపెనీ విలువ ఇప్పుడు ఏకంగా రూ. 100 కోట్లు దాటడం విశేషం. 30 ఏళ్ల వయసులోపే ఈ ఘనత సాధించిన యువతిగా నిలిచింది. ప్రస్తుతం బిజినెస్ వరల్డ్‌లో ఈమెకు ఒక ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది.


స్టార్టప్ ఎలా ప్రారంభించారంటే?


అహానా అమెరికాలో ఉన్నప్పుడు బాగా బరువు పెరిగింది. అప్పుడు ఆమె ఒక హెల్దీ ఫుడ్ స్టోర్‌కు వెళ్లింది. అప్పుడే ఆమెకు హెల్దీ ఫుడ్ ప్రాముఖ్యత తెలిసొచ్చింది. అక్కడ స్టోర్‌లో ఎలాంటి జంక్ ప్రొడక్ట్స్ లేకపోవడం చూసి ఆశ్చర్యపోయింది. భారత్‌లో ఇలా ఎందుకు లేదా అని ఆలోచించింది. ఆ ఆలోచనే ఇప్పుడు స్టార్టప్ పెట్టేందుకు పునాది వేసింది.


దీంతో హెల్దీ స్నాక్స్ బిజినెస్ స్టార్ట్ చేసింది. అమెరికాలో జాబ్ వదిలేసి తన తల్లి సపోర్ట్‌తో 2019లో బిజినెస్ వెంచర్ ఓపెన్ సీక్రెట్ ప్రారంభించింది. ఆమె తల్లి పెట్టుబడి, మద్దతుతోనే ఇది సాధ్యమైందని అహానా పలు సందర్భాల్లో చెప్పింది కూడా.


FMCG సెక్టార్‌లో పనిచేసిన అనుభవం ఉన్న అహానాకు.. శుద్ధి చేసిన పంచదార, పిండి వాటి గురించి బాగా తెలుసు. అందుకే ఆమె తన ప్రొడక్ట్స్‌లో ఎలాంటి పిండి, పామాయిల్ వంటివి ఉంచొద్దని నిర్ణయించుకుంది. పూర్తి జంక్ ఫ్రీ ఫుడ్ ఆఫర్ చేసిందన్నమాట. ఈ స్నాక్స్‌లో విపరీతమైన పోషకాలు ఉండేలా చూసుకుంది. ప్రస్తుతం ఎన్నో స్టోర్లలో ఈ ఓపెన్ సీక్రెట్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. స్వయంగా ఈ కంపెనీ కూడా వెబ్‌సైట్ నడుపుతోంది. ఇంకా ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా కొనుగోలు చేయొచ్చు.


అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు..


ఓపెన్ సీక్రెట్ ఫౌండర్, సీఈఓ అయిన అహానా గౌతమ్ హార్డ్ వర్క్‌కు ఇప్పుడు భారత్ సహా ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కుతోంది. అంతర్జాతీయ స్థాయిలో.. భారత స్టార్టప్స్‌కు కూడా చోటు దక్కుతుందన్న దానికి ఆమె స్థాపించిన కంపెనీనే నిదర్శనం అని చాటింది. చిన్న ఆలోచనతో బిజినెస్ ప్రారంభించి మూడేళ్లలోనే రూ. 100 కోట్ల టర్నోవర్ దాటించడం విశేషం.


ఆమె చదువు విషయానికి వస్తే 2010లో ఐఐటీ బాంబేలో కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్ డిగ్రీ పొందింది. తర్వాత పైచదువుల కోసం అమెరికా వెళ్లింది. హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో MBA పూర్తి చేసింది. తర్వాత పలు ఉద్యోగాలు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com