లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గత నెల తొలి వారంలో ఓ సరికొత్త పాలసీని లాంఛ్ చేసింది. ఒకే ప్లాన్ లో రెండు బెనిఫిట్స్ అందిస్తోంది. ఇటు జీవిత బీమా కవరేజీతో పాటు అటు పెట్టుబడికీ అవకాశం కల్పిస్తోంది. అదే ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ పాలసీ. ఒకే పాలసీతో డబుల్ బెనిఫిట్స్ లభిస్తున్నాయి. 60 ఏళ్ల వయసు లోపు ఉండే వారు ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకోవడం ద్వారా 10 రెట్ల వరకు ఇన్సూరెన్స్ కవరేజీతో పాటు సంపద వృద్ధి చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ పేరిట తీసుకొచ్చిన ఈ పాలసీలో 50 ఏళ్ల లోపు వారు తీసుకున్నారు అనుకుందాం. వారు చెల్లించిన వార్షిక ప్రీమియానికి 7 నుంచి 10 రేట్లు బీమా కవరేజీ లభిస్తుంది. అదే 51-60 ఏళ్ల వయసు వారు ఈ పాలసీ ఎంచుకుంటే వారికి 7 రెట్ల వరకూ బీమా రక్షణ లభిస్తుంది. ప్రీమియం చెల్లింపును బట్టి 10 - 15 ఏళ్ల కనీస వ్యవధి ఎంచుకోవాలి. 25 ఏళ్ల వరకూ పాలసీని కొనసాగించాల్సి ఉంటుంది. వార్షిక కనీస ప్రీమియం రూ.30 వేలుగా ఉంటుంది. ఆరు నెలలు, మూడు నెలలు, నెల నెలా సైతం ప్రీమియం చెల్లించే వీలవుతుంది. నెలకోసారి కనీస ప్రీమియం రూ.2,500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. టర్మ్ కొనసాగినంత కాలం లైఫ్ కవరేజీ ఉంటుంది. అలాగే మోర్టాలిటీ ఛార్జీలను రీఫండ్ చేస్తారు. అలాగే మెచ్యూరిటీ వరకు పాలసీ తీసుకున్న వ్యక్తి జీవించి ఉంటే మోర్టాలిటీ ఛార్జీలపై విధించిన ట్యాక్సులను మాఫీ చేస్తారు.
పెట్టుబడులకు అవకాశం..
ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ పాలసీ తీసుకుంటే.. ఎన్ఎస్‌ఈ 100 ఇండెక్స్, ఎన్ఎస్ఈ 50 ఇండెక్స్ లలోని ఎంపిక చేసిన షేర్లలో పెట్టుబడులు పెట్టే ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్ లేదా ఫ్లేక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్లలో ఒకటి పెట్టుబడి కోసం ఎంచుకోవచ్చు. అయిదేళ్ల పాటు పెట్టుబడులు కొనసాగించిన తర్వాత నిబంధనల మేరక పాక్షికంగా ఉపసంహరించుకోవచ్చు. మెచ్యూరిటీ నాటికి పాలసీదారుడు జీవించి ఉంటే.. యూనిట్ ఫండ్స్ విలువకు సమానమైన నగదు చెల్లింపులు చేస్తారు. గ్యారెంటీడ్ అడిషన్స్ అనేవి బీమా కవరేజీ ఉన్నప్పుడే చెల్లిస్తారు. పాలసీ ప్రీమియం గడువు ముగిసి కవరేజీ కొనసాగుతున్న క్రమంలో ప్రీమియంలో కొంత శాతం గ్యారెంటీడ్ అడిషన్స్ చెల్లిస్తారు. ఈ నిధులు యూనిట్ ఫండ్స్ కి వెళతాయి. ఇలా పెద్ద మొత్తంలో కార్పస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే, మీరు ఎంచుకునే ఫండ్స్ పని తీరు ఆధారంగా మీ రిటర్న్స్ అనేవి ఆధారపడి ఉంటాయని గుర్తుంచుకోవాలి. పూర్తి వివరాలు తెలుసుకున్నాకే ఈ పాలసీ కొనుగోలు చేయడం మంచిది.