ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలర్ట్. మీరు పన్ను తగ్గించుకునేందుకు ఎన్నో పెట్టుబడి పథకాలు ఎంచుకుంటుంటారు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను తగ్గింపు ప్రయోజనాలు పొందాలంటే మార్చి 31లోగా పెట్టుబడులు పెట్టాలి. దీని కోసం కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ పెన్షన్ సిస్టమ్, సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్ ఇలా చాలా పథకాలే ఉన్నాయి. ఇంకా మ్యూచువల్ ఫండ్లలో కూడా కొన్నింటిపై టాక్స్ డిడక్షన్ పొందొచ్చు. ELSS ఫండ్లు కూడా ఉంటాయి. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ - 80c కింద ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు పన్ను తగ్గించుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. అయితే ఇంకో ఆప్షన్ కూడా ఉందండోయ్.
బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లపైనా పన్ను తగ్గించుకోవచ్చు. అయితే ఐదేళ్ల టెన్యూర్ ఉన్న డిపాజిట్లపైనే ఇది వర్తిస్తుంది. వీటినే టాక్స్ సేవింగ్ ఎఫ్‌డీ అంటారు. వీటిల్లో వడ్డీ రేట్లు కూడా ఆకర్షణీయ స్థాయిల్లోనే ఉంటాయి. ఇక వడ్డీ రేట్లు బ్యాంకుల్ని బట్టి మారుతుంటాయి. ఒక్కో బ్యాంకుల్లో ఒక్కో రీతిలో ఉంటాయన్నమాట. ఇంకా సాధారణ డిపాజిటర్లతో పోలిస్తే సీనియర్ సిటిజెన్లకు వడ్డీ రేటు అదనంగా మరో 50 బేసిస్ పాయింట్ల వరకు ఎక్కువ వస్తుందని చెప్పొచ్చు. ఇక సీనియర్ సిటిజెన్లకు అత్యధికంగా 7.75 శాతం, జనరల్ పబ్లిక్‌కు 7.25 శాతం వరకు వడ్డీ ఉంది. బ్యాంకుల ఫుల్ లిస్ట్ ఇప్పుడు చూద్దాం.
అత్యధికంగా ప్రైవేట్ రంగానికి చెందిన ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఐదేళ్ల టెన్యూర్ టాక్స్ సేవింగ్ డిపాజిట్‌పై సీనియర్ సిటిజెన్లకు 7.75 శాతం వడ్డీ ఇస్తోంది. ఇక్కడ జనరల్ సిటిజెన్లకు 7.25 శాతం వడ్డీ వస్తోంది. యాక్సిస్ బ్యాంకులో జనరల్ పబ్లిక్‌కు 7 శాతం, సీనియర్ సిటిజెన్లకు 7.75 శాతం వడ్డీ అందుతోంది.
HDFC బ్యాంకులో జనరల్ పబ్లిక్‌కు ఐదేళ్ల టెన్యూర్ డిపాజిట్లపై వడ్డీ రేటు 7 శాతం, సీనియర్ సిటిజెన్లకు 7.50 శాతం వడ్డీ వస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకులో కూడా ఇదే విధంగా ఉంది. కోటక్ మహీంద్రా బ్యాంకులో వరుసగా 6.2 శాతం, 6.7 శాతంగా ఉంది.
దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంకు.. ఎస్‌బీఐలో ఈ వడ్డీ రేట్లు రెగ్యులర్ సిటిజెన్లకు 6.50 శాతం, సీనియర్ సిటిజెన్లకు 7.5 శాతంగా ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 6.50 శాతం, 7.15 శాతంగా ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఇది 6.5 శాతం, 7 శాతంగా ఉంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో టాక్స్ సేవింగ్ FD పై 6.25 శాతం, సీనియర్ సిటిజెన్లకు 6.75 శాతం వడ్డీ అందుతోంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇది 6.5 శాతం, 7 శాతంగా ఉంది.