కొన్ని నిర్దిష్ట పేమెంట్లు చేసేందుకు వాటిపై మూలం వద్ద పన్ను మినహాయింపు (ట్యాక్స్ డిడక్టెట్ ఎట్ సోర్స్- టీడీఎస్) కట్ చేయాల్సి ఉంటుంది. అలాగే దానికి సంబంధించిన నిర్దిష్ట రేటు ప్రకారం టీడీఎస్ కట్ చేయడం ఎంత ముఖ్యమో.. పాన్- ఆధార్ లింక్ స్టేటస్ ను బట్టి సరైన అమౌంట్ టీడీఎస్ మినహాయించడమూ అంతే ముఖ్యం. ఎందుకంటే పన్ను చెల్లింపుదారుల పాన్- ఆధార్ లింక్‌ను బట్టి టీడీఎస్ రేటులో చాలా వ్యత్యాసాలు ఉంటాయి. పాన్-ఆధార్ లింక్ అయితే ఒక రేటు, లింక్ చేయకపోతే ఒక రేటు పడుతుంది. ఇనాపరేటివ్ పాన్ ఉన్నట్లయితే గరిష్ఠ రేటు టీడీఎస్ కట్ చేయాల్సి ఉంటుంది.
అలాగే.. టీడీఎస్ డిడక్టర్లు లేదా కలెక్టర్లు కచ్చితంగా టీడీఎస్ వర్తించే చెల్లింపులు చేసినప్పుడు ఆ పేమెంట్లు అందుకునే సదరు వ్యక్తి పాన్- ఆధార్ లింక్ అయి ఉందో లేదో చెక్ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి తనిఖీలు చేయకుండా టీడీఎస్ కట్ చేసినట్లయితే.. ఏదైనా లీగల్ యాక్షన్ లేదా టాక్స్ పెనాల్టీలు వస్తే దానికి అతనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకే నిర్దిష్ట చెల్లింపులపై టీడీఎస్ కలెక్ట్ చేసే వ్యక్తులు, సంస్థలు కచ్చితంగా పాన్- ఆధార్ లింక్ స్టేటస్ తనిఖీ చేయాల్సి ఉంటుంది లేదంటే వారికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు సైతం రావచ్చు.
నిర్దిష్ట చెల్లింపులపై టీడీఎస్ డిడక్ట్ చేసిన తర్వాత 30 రోజుల్లోపు ఆ నగదును ప్రభుత్వానికి అప్పజెప్పాల్సి ఉంటుంది. పాన్ ఇనాపరేటివ్ గా ఉన్న సందర్భంలో టీడీఎస్ కట్ చేసినట్లయితే హయ్యర్ రేట్ టీడీఎస్ మినహాయించాల్సి ఉంటుంది. లేదంటే వాటిపై పడే పెనాల్టీలు డిడక్టర్ కట్టాల్సి వస్తుంది. అందుకే టీడీఎస్ కట్ చేసే రోజునే ఎదుటి వ్యక్తి పాన్- ఆధార్ లింక్ అయిందో లేదో చెక్ చేయడం చాలా ముఖ్యం. ఇదే విషయంపై చాలా మంది టీడీఎస్ కలెక్టర్లకు ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు వస్తున్నాయి. 'షార్ట్ డిడక్షన్ ఆఫ్ టీడీఎస్' పేరుతో ఈ నోటీసులు పంపిస్తోంది ఐటీ శాఖ. ప్రాపర్టీ సేల్ కి సంబంధించిన పేమెంట్లు చేసినప్పుడు టీడీఎస్ కట్ చేసిన రోజు, దానిని ప్రభుత్వానికి డిపాజిట్ చేసిన రోజున పాన్- ఆధార్ స్టేటస్ ను చెక్ చేస్తుంది ఐటీ శాఖ. ఒక వేళ ఏదైనా తేడా ఉంటే డిడక్టర్లకు నోటీసులు పంపుతోంది.
హౌస్ ప్రాపర్టీ రెంట్ నెలకు రూ.50 వేలు దాటినప్పుడు టీడీఎస్ మినహాయించాల్సి ఉంటుంది. అలాగే రూ.50 లక్షలు అంతకు మించి స్థిరాస్తి ప్రాపర్టీ విక్రయాలు జరిగినప్పుడు, నిర్దిష్ట పరిమితికి మించి రెసిడెంట్ కాంట్రాక్టర్ లేదా ప్రొఫెషనల్స్ కి పేమెంట్ చేసినప్పుడు, శాలరీ పేమెంట్లు, ప్రత్యేక కేసుల్లో విదేశీ ఖర్చులపైనా టీడీఎస్ అనేది కట్ చేయాల్సి ఉంటుంది. ఇలా నిర్దిష్ట పేమెంట్లపై టీడీఎస్ కట్ చేస్తున్నప్పుడు పాన్- ఆధార్ లింక్ స్టేటస్ విషయంలో పొరపాట్లు చేస్తే వారికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు రావచ్చు. కొన్నిసార్లు వడ్డీ, పెనాల్టీలు సైతం వారిపైనే పడతాయి.