స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే వారు ఎక్కువగా ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కోసం ఎదురుచూస్తుంటారన్న సంగతి తెలిసిందే. వీటిల్లో షేర్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక ప్రముఖ కంపెనీల నుంచి ఐపీఓ వస్తుందంటే ఎగిరి గంతేస్తారని చెప్పొచ్చు. ఇప్పుడు అందుకు సిద్ధంగా ఉండండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సంస్థ నుంచి మరొక ఐపీఓ రాబోతుంది. ఇప్పటివరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి చాలానే సబ్సిడరీలు ఉన్నప్పటికీ పబ్లిక్ లిస్టింగ్‌లో ఎక్కువగా లేవని చెప్పొచ్చు. అదే మరోవైపు దిగ్గజ టాటా గ్రూప్ నుంచి 30 వరకు కంపెనీలు స్టాక్ మార్కెట్లలో లిస్టయ్యాయి. ఇంకా అదానీ గ్రూప్‌కు చెందిన 10 కంపెనీలు కూడా ట్రేడింగ్ చేస్తున్నాయి. అంబానీ సంస్థ నుంచి చాలానే అనుబంధ సంస్థలు ఉన్నప్పటికీ స్టాక్ మార్కెట్లలో లిస్టయినవి తక్కువేనని చెప్పొచ్చు.
అయితే ఇప్పుడు ఇన్వెస్టర్లకు శుభవార్త అందింది. రిలయన్స్ గ్రూప్‌లో ఉన్న చాలా కంపెనీల నుంచి మొదటగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఐపీఓకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం ఇది ప్రాథమిక దశలోనే ఉందని.. ఈ టెలికాం కంపెనీనే మొదటగా ఐపీఓ కోసం తెచ్చేందుకు ప్రయత్నిస్తుందని తెలిసింది.
ఈ ఐపీఓ విషయానికి వస్తే తెలిసిన సమాచారం మేరకు.. దీని విలువను ఏకంగా 100 బిలియన్ డాలర్లుగా .. భారత కరెన్సీలో సుమారు రూ. 8 లక్షల కోట్లకుపైగా లెక్కగట్టినట్లు తెలుస్తోంది. ఒక్కో షేరు ఇష్యూ ధరను రూ. 1200 వరకు నిర్ణయించనున్నట్లు సమాచారం. లార్జ్ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ ఎస్) కాంపొనెంట్ కింద పబ్లిక్ ఆఫరింగ్‌కు వస్తున్నట్లు అనుకుంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతానికి జియో వాల్యుయేషన్ 82 నుంచి 94 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని.. ఈ ఏడాదిలో ఎన్నికల ఫలితాల తర్వాత జియో మొబైల్ టారిఫ్స్ పెంచే దిశగా ఆలోచిస్తుందని.. అప్పుడు విలువ ఇంకా పెరుగుతుందని చెబుతున్నారు.
2016లో రిలయన్స్ ఇండస్ట్రీస్.. జియోను మార్కెట్లోకి తీసుకురాగా అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. అప్పటికే మార్కెట్లో ఉన్న ఎయిర్‌టెల్, వొడాఫోన్- ఐడియా వంటి వాటితో పోలిస్తే అతి తక్కువ టారిఫ్స్‌తో జియో సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే కొన్నేళ్లలోనే వాటన్నింటినీ అధిగమించి అగ్రస్థానానికి చేరుకుంది.
2020లోనే ఈక్విటీ మార్కెట్లోకి వస్తుందని వార్తలొచ్చినా.. పలు కారణాలతో వాయిదా వేసుకుంది. ఇప్పుడు ఎట్టకేలకు అందుకు రంగం సిద్ధమైందని తెలుస్తుంది. ఐపీఓలో ఇన్వె్స్ట్ చేసేందుకు మొదట సబ్‌స్క్రిప్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సక్సెస్‌ఫుల్ ఇన్వెస్టర్లకు షేర్లు అలాట్ చేస్తారు.