కేంద్రంలో మరోసారి ఎన్డీయే సర్కార్ కొలువుదీరింది. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టారు. ఆదివారం రోజున 70 మంది మంత్రులతో పాటు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మరుసటి రోజున ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కొత్త మంత్రివర్గం సమావేశమైంది. ఇందులో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని లక్షలాది పేద ప్రజలకు లబ్ధి చేకూర్చాలని నిర్ణయించారు. పీఎం ఆవాస్ యోజనకు సంబంధించి తొలి నిర్ణయం తీసుకుంది కేంద్ర కేబినెట్. పట్టణ, గ్రామీణ ప్రాంత పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించేందుకు కేబినేట్ ఆమోదం తెలిపింది.
సోమవారం సమావేశమైన యూనియన్ కేబినేట్ పీఎం ఆవాస్ యోజన విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు పీఎం ఆవాస్ యోజనకు అర్హులైన కుటుంబాల సంఖ్య పెరిగిన క్రమంలో ఈ మేరకు మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది కేబినేట్. గ్రామీణ, పట్టణ ప్రాంతంలోని పేద ప్రజలకు ఇప్పటికే ఆమోదం తెలిపిన ఇళ్లతో పాటు మరో 3 కోట్ల ఇళ్లకు కేంద్రం ఆర్థిక సాయం అందించనుంది.
కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు గాను ప్రధాన మంత్రి ఆవాస్ యోజనను 2015-16 బడ్జెట్ లో ప్రకటించింది. అర్హులైన గ్రామీణ, పట్టణ పేద ప్రజలకు ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం అందించడమే ఈ పథకం లక్ష్యం. గడిచిన 10 ఏళ్ల కాలంలో పీఎం ఆవాస్ యోజనలో భాగంగా 4.21 కోట్ల ఇళ్ల నిర్మాణాలు పూర్తయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ పథకం కింద నిర్మాణాలు జరిగిన కుటుంబాలకు కేంద్రం నుంచి ఇతర సౌకర్యాలు సైతం అందించారు. అందులో టాయిలెట్లు, ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్, విద్యుత్తు కనెక్షన్, నల్లా కనెక్షన్ వంటివి ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది.