తెలంగాణ రాజధాని హైదరాబాద్ రేంజ్ మారిపోతోంది. మరోసారి ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలు ఆఫీసులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. టాప్ మల్టీ నేషనల్ కంపెనీలు ఇందుకోసం పోటీపడుతున్నాయి. ఇటీవల టాప్ కంపెనీలు ఏకంగా 8.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం మేర ఆఫీస్ స్పేస్ లీజుకు తీసుకున్నాయి. ప్రాప్‌స్టాక్ షో ఈ మేరకు డాక్యుమెంట్లను యాక్సెస్ చేసి వివరాలు వెల్లడించింది. ఇక వీటిల్లో రెంట్లు కూడా భారీగానే ఉన్నాయి. నెలకు కనీసం రూ. 70 లక్షల నుంచి ఏకంగా రూ. 3.15 కోట్ల వరకు కూడా ఉండటం గమనార్హం. మే 28న పెద్ద పెద్ద కంపెనీలు క్వాల్‌కామ్ ఇండియా, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, ఐబీఎం ఇండియా, ఎస్ అండ్ పీ క్యాపిటల్ ఐక్యూ ఇండియా ప్రైవేట్ లిమిటడ్ హైదరాబాద్‌లోని వేర్వేరు చోట్ల పెద్ద మొత్తంలో స్థలం లీజుకు తీసుకున్నట్లు తెలిసింది.
క్వాల్‌కామ్..
క్వాల్‌కామ్ సంస్థ బిజినెస్ హబ్ హైటెక్ సిటీలో ఏకంగా 4.14 లక్షల చదరపు అడుగుల స్థలం లీజుకు తీసుకుంది. దీని కోసం నెలకు ఏకంగా రూ. 3.15 కోట్ల అద్దె చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ప్రైమ్ ది స్కైవ్యూ బిల్డింగ్‌లోని 18-22 ఫ్లోర్లను ఆఫీస్ స్పేస్ కోసం తీసుకుంది. సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. 16.4 కోట్లు చెల్లించింది. ఇక్కడ దివిజ కమర్షియల్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో డీల్ జరిగింది.
ఐబీఎం ఇండియా..
ఐబీఎం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కూడా 1.06 లక్షల చదరపు అడుగుల స్థలం లీజుకు తీసుకుంది. ఇది గచ్చిబౌలి ప్రాంతంలోని 26 ఎకరాల మేర విస్తరించి ఉన్న దివ్యశ్రీ ఓరియాన్‌లో ఉంది. ఇక్కడ సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ. 4.21 కోట్లు చెల్లించింది సంస్థ. నెలకు రూ. 70.23 లక్షలుగా అద్దె ఉంది. మిదాస్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ యజమాని. 10,11 ఫ్లోర్లలోని ఆఫీస్ స్పేస్ కోసం ఈ డీల్ జరిగింది.
ఎస్ అండ్ పీ క్యాపిటల్ ఐక్యూ ఇండియా..
S&P గ్లోబల్ సంస్థ రీసెర్చ్ డివిజెన్ అయిన ఈ కంపెనీ హైటెక్ సిటీ స్కైవ్యూ బిల్డింగ్‌లోనే 2.41 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ డీల్ చేసుకుంది. ఇక్కడ నెలవారీ అద్దె రూ. 1.77 కోట్లుగా ఉంది. సెక్యూరిటీ డిపాజిట్ కింద ఇక్కడ రూ. 10.6 కోట్లు చెల్లించింది. లీజింగ్ పీరియడ్ ఐదేళ్లుగా ఉండగా.. మరో 15 సంవత్సరాలు పొడిగించుకునే వెసులుబాటు ఉంది. 19,20,21 ఫ్లోర్లలో ఆఫీస్ స్పేస్ ఉంది.
ఎల్‌టీఐ మైండ్‌ట్రీ..
అదే హైటెక్ సిటీ స్కైవ్యూ బిల్డింగ్‌లో ఎల్‌టీఐ మైండ్‌ట్రీ. కూడా 1.09 లక్షల చ.అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది. నెలవారీ అద్దె ఇక్కడ రూ. 89.18 లక్షలుగా ఉంది. 14,15 ఫ్లోర్లలోని ఆఫీసుల కోసం డీల్ చేసుకోగా.. సెక్యూరిటీ డిపాజిట్ (అద్దె) రూ. 6.2 కోట్లు చెల్లించింది.