ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో పతకం గెలవకపోయినా.. తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు లక్ష్యసేన్. సెమీఫైనల్స్‌కు చేరుకుని చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్ తుదిలో పతకాన్ని కోల్పోయాడు. సెమీస్ చేరడంతోనే అసలు ఎవరీ లక్ష్యసేన్ అనే చర్చ మొదలైంది. వాస్తవానికి బ్యాడ్మింటన్ అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎక్కువుగా తెలిసిన పేర్లు పుల్లెల గోపిచంద్, పీవీ సింధు, సైనా నెహ్వాల్, సాత్విక్ సాయిరాజ్.. వీరంతా తెలుగువాళ్లు కావడంతో ఇక్కడ ప్రజలకు సుపరిచితులు. కానీ ప్రస్తుతం దేశం మొత్తం చర్చించుకుంటున్న పేరు లక్ష్యసేన్. పారిస్ ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో కాంస్య పతకాన్ని తుదిలో చేజార్చుకున్నప్పటికీ తన ఆటతీరుతో అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు లక్ష్యసేన్. కాంస్య పతక పోరులో మలేషియాకు చెందిన లీ జీ జియాపై లక్ష్యసేన్ ఓటమి చవిచూశాడు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో తన లక్ష్యాన్ని సాధిస్తాడని ఆశించినప్పటికీ నిరాశే ఎదురైంది.