రంజీ ట్రోఫీ నాలుగో రౌండ్‌లో ఉత్తరప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీనియర్ దిగ్గజ ఆటగాడు జలజ్ సక్సేనా చరిత్ర సృష్టించాడు. బంతితో మరోసారి ఈ ఆల్ రౌండర్ మెరిశాడు. యూపీపై 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో రంజీ ట్రోఫీలో ఏకంగా 29వ సారి 5 వికెట్ల మైలురాయిని ఈ ఆఫ్-స్పిన్నర్ సాధించాడు. నితీశ్ రాణా వికెట్ తీయడం ద్వారా 400 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. దీంతో రంజీ ట్రోఫీలో 6,000 పరుగులు, 400 వికెట్లు సాధించిన మొట్టమొదటి ఆటగాడిగా ఈ 37 ఏళ్ల క్రికెటర్ నిలిచాడు.రంజీ ట్రోఫీ మూడవ రౌండ్‌లో భాగంగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 6,000 పరుగుల మైలురాయిని జలజ్ సక్సేనా పూర్తి చేసుకున్నాడు. ఈ గణాంకాలను బట్టి అతడు దీర్ఘకాలంగా ఎంత స్థిరంగా రాణిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. కాగా దాదాపు రెండు దశాబ్దాలుగా దేశవాళీ క్రికెట్ ఆడుతున్న జలజ్ సక్సేనా కెరీర్‌లో ఒక్కసారి కూడా జాతీయ జట్టుకు ఆడకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశం.సక్సేనా 18 ఏళ్ల క్రితం ఫస్ట్-క్లాస్ కెరీర్ ప్రారంభించాడు. మధ్యప్రదేశ్ జట్టుకు ఏకంగా 11 సంవత్సరాలు ఆడాడు. మధ్యప్రదేశ్ జట్టు తరఫున ఆడుతూ 159 వికెట్లు... 4,041 పరుగులు సాధించాడు. 2016-17 రంజీ ట్రోఫీ సీజన్‌కు ముందు కేరళ జట్టుకు మారాడు. ఆ తర్వాత ఎప్పుడూ వెనుదిరిగి చూసుకోలేదు. ఇక దేశవాళీ క్రికెట్‌లో రంజీ ట్రోఫీతో పాటు అన్ని ఫార్మాట్లలో కలిపి 9,000 పరుగులు, 600 వికెట్లు సాధించాడు. ఈ ఘనత సాధించిన నాలుగవ ఆటగాడిగా సక్సేనా కొనసాగుతున్నాడు. 222 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. అందులో 14 సెంచరీలు, 33 అర్ధ సెంచరీలు సాధించాడు. బ్యాటింగ్ సగటు 33.97 పరుగులుగా ఉంది.