వైసీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డిని పోలీసులు విడిచిపెట్టడంపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, వంగలపూడి అనిత, వైఎస్ షర్మిల సహా పలువురు విపక్ష నేతలపై వర్రా రవీందర్ రెడ్డి అసభ్యకరమైన పోస్టులు పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి కడప పోలీసులు పులివెందులలో వర్రా రవీందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కడపకు తీసుకువచ్చి రహస్యంగా విచారించారు. అనంతరం బుధవారం తెల్లవారుజామున 41A నోటీసులు ఇచ్చి వర్రా రవీందర్‌రెడ్డిని విడిచిపెట్టారు.
అయితే వర్రా రవీందర్‌రెడ్డిని అలా వదిలేయటంపై ప్రభుత్వం సీరియస్ అయినట్లు తెలిసింది. దీనిపైనా సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కడప పోలీసులు అప్రమత్తమయ్యారు. వర్రా రవీందర్ రెడ్డి కోసం గాలిస్తున్నారు. అయితే నోటీసులు అందుకుని బయటకు వచ్చిన వర్రా రవీందర్ రెడ్డి కనిపించకుండా పోయారు. నోటీసులు అందుకున్న తర్వాత అదృశ్యమైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కడప ఎస్పీ కార్యాలయానికి చేరుకుని ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో సమావేశమయ్యారు. వర్రా రవీంద్రారెడ్డి కేసుపై ఆరా తీశారు. మరోవైపు మరికొద్ది్సేపటికే హర్షవర్ధన్ రాజును ప్రభుత్వం బదిలీ చేసింది.
మరోవైపు బుధవారం తెల్లవారుజామున వర్రా రవీందర్ రెడ్డికి 41ఏ కింద నోటీసులు ఇచ్చిన కడప పోలీసులు.. ఎప్పుడు విచారణకు పిలిచినా రావాలని ఆదేశించారు. అనంతరం మరో కేసులో అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా అప్పటికే వర్రా అదృశ్యమయ్యారు. ఆయన కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే వర్రా రవీందర్ రెడ్డి భార్య, సోదరుడు, మరదలను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. వేముల పోలీసులు వీరిని కడప రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.అనంతరం కడప ఎస్పీ ఎదుట హాజరు పరచనున్నట్లు సమాచారం. వర్రా రవీందర్ రెడ్డిపై మంగళగిరి, పులివెందుల, హైదరాబాద్‌లలో పలు కేసులు ఉన్నాయి.