అమెరికా ఎన్నికల్లో భారతీయులు సత్తా చాటారు. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు ఈసారి ఆరుగురు సభ్యులు ఎన్నికయ్యారు. గతంలో ఈ సంఖ్య ఐదుగా ఉంది. ఈసారి శ్రీ తానేదార్, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, డాక్టర్ అమిబెరా, ప్రమీలా జయపాల్ మరోసారి గెలుపొందారు. వారితో పాటు న్యాయవాది సుహాస్ సుబ్రహ్మణ్యం వర్జీనియా 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి డెమొక్రటిక్ పార్టీ తరఫున విజయం సాధించారు.దీంతో సమోసా కాకస్ (ప్రతినిధుల సభ, సెనెట్‌కు ప్రాతినిథ్యం వహించే ఇండియన్ అమెరికన్ల గ్రూప్)లో సభ్యుల సంఖ్య ఆరుకు చేరుకుంది.అమిబేరా కాలిఫోర్నియాలోని 6వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి మరోసారి గెలిచారు. 59 ఏళ్ల అమిబేరా 2013 నుంచి ఈ స్థానం నుంచి గెలుస్తున్నారు. రాజా కృష్ణమూర్తి ఇల్లినాయ్ 8వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి గెలిచారు. 2016లో తొలిసారి ఆయన ఇక్కడి నుంచి విజయం సాధించారు.ప్రమీలా జయపాల్ వాషింగ్టన్‌లోని 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి గెలుపొందారు. 2017 నుంచి ఆమె ఇక్కడి నుంచి గెలుస్తూ వస్తున్నారు. రో ఖన్నా కాలిఫోర్నియాలోని 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి విజయం సాధించారు. మిచిగాన్‌లోని 13వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి శ్రీ తానేదార్ విజయం సాధించారు.