జమ్మూ కాశ్మీర్‌లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఆర్టికల్ 370ని పునరుద్ధరించేందుకు సంప్రదింపులు ప్రారంభించాలని కోరుతూ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం చేసింది. బీజేపీ ఎమ్మెల్యేలు ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో అసెంబ్లీలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇలాంటి గందరగోళ పరిస్థితి మధ్యే స్పీకర్ అబ్దుల్ రహీమ్ ఈ తీర్మానంపై ఓటింగ్ నిర్వహించి ఆమోదం పొందినట్లు ప్రకటించారు. అనంతరం తీవ్ర ఉద్రిక్తతల మధ్య సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సభ వాయిదా పడిన అనంతరం మీడియాతో మాట్లాడిన అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోసుకున్నారు.
ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్‌కు కొన్ని ప్రత్యేక అధికారాలను కల్పిస్తోంది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేసింది. పార్లమెంట్ ఆమోదం ద్వారా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో జమ్మూ కాశ్మీర్‌కు కొన్ని దశాబ్దాలుగా ఉన్న ప్రత్యేక అధికారాలు రద్దయ్యాయి. అనంతరం జమ్మూ కాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్‌లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని JKNC అక్టోబర్ 16న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జమ్మూ కాశ్మీర్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చోటు చేసుకున్న తాజా పరిణామం ఇది.
జమ్మూ కాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరి.. అసెంబ్లీలో బుధవారం (నవంబర్ 6) ఉదయం ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. జమ్మూ కాశ్మీర్ ప్రజల గుర్తింపు, సంస్కృతి, హక్కులను పరిరక్షించడంలో ఆర్టికల్ 370 రక్షణగా నిలుస్తోందని తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ఆయన అన్నారు. అనంతరం ఆర్టికల్ 370 పునఃస్థాపనకు సంబంధించి ఎన్నికైన ప్రతినిధులతో చర్చలు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది.
‘ఆర్టికల్ 370ని ఏకపక్షంగా తొలగించడంపై ఈ సభ ఆందోళన వ్యక్తం చేస్తోంది. జమ్మూ కాశ్మీర్ ప్రజల గుర్తింపు, సంస్కృతి, హక్కులను పరిరక్షించే ప్రత్యేక హోదాను రాజ్యాంగ హామీ ద్వారా పొందాం. ఆ చట్టాన్ని పున:స్థాపించాలని ఈ సభ కోరుతోంది’ అని సురీందర్ చౌదరి అన్నారు. ప్రతిపక్ష నాయకుడు సునీల్ శర్మ సహా బీజేపీ సభ్యులు తీవ్ర వ్యతిరేకతను వినిపించారు. ముందుగా ప్రకటించిన అంశాల్లో ఈ తీర్మానాన్ని చేర్చలేదని వాదించారు. దేశంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేవాలయం (పార్లమెంట్) ఈ చట్టాన్ని ఆమోదించిందని సునీల్ శర్మ అన్నారు. బీజేపీ సభ్యులు తీర్మానం ప్రతులను చించివేసి, వెల్‌లోకి విసిరేశారు. వారి నిరసనలతో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ అట్టుడికిపోయింది.
బయటి వ్యక్తులు ఆస్తులు కొంటున్నారు..
‘బయటి నుంచి వచ్చిన వ్యక్తులు జమ్మూ కాశ్మీర్‌లో ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో జమ్మూ కాశ్మీర్ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆర్టికల్ 370 రద్దు కారణంగా ఇక్కడి ప్రజలు నష్టపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు’ అని డిప్యూటీ సీఎం సురీందర్ సింగ్ చౌదరి అన్నారు. సభ వాయిదా పడిన అనంతరం ఏఎన్‌ఐ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీపై విరుచుకుపడ్డారు. ‘2019లో మా నుంచి లాక్కున్న ప్రత్యేక హోదా గురించి మాత్రమే మేం మాట్లాడాం. ఒకవేళ బీజేపీ సభ్యులకు నార్కో టెస్ట్ చేస్తే, వారు కూడా అదే కోరుకుంటున్నారని రుజువవుతుంది’ అని సురీందర్ కుమార్ చౌదరి అన్నారు.
‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీహార్‌కు ప్రత్యేక హోదా హామీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేక హామీలు, గ్రాంట్ ఇచ్చింది. వారు (బీజేపీ) రాముడి పేరు (అసెంబ్లీలో) తీసుకున్నప్పుడు, ప్రతి ఒక్కరికీ వారి హక్కులు ఉండాలని, జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా పొందాలని మేము వారికి చెప్పాలనుకుంటున్నాం’ అని కాశ్మీర్ డిప్యూటీ సీఎం అన్నారు. వారి LG పాలనా కాలంలో రాజౌరి, చీనాబ్, కథువా, సాంబా లోయలో మిలిటెన్సీ ముగిసిందా అని ఆయన ప్రశ్నించారు. 2019లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు (జమ్మూ కాశ్మీర్, లడఖ్)గా విభజించారు. మోదీ సర్కార్ తీసుకున్న సంచలన నిర్ణయాల్లో ఇదొకటిగా నిలిచింది.