గత కొన్ని నెలలుగా ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ తిరుగులేని విజయాన్ని దక్కించుకుంది. ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ 270 మేజిక్ ఫిగర్‌ను దాటేసి దూసుకెళ్తున్నారు. తాజాగా విస్కాన్సిన్‌లో విజయంతో ఇప్పటివరకు డొనాల్డ్ ట్రంప్ 277 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా.. కమలా హారిస్ 224 సీట్లు సాధించారు. ఇక కీలకమైన 7 స్వింగ్ స్టేట్స్‌లో నాలుగింటిని ట్రంప్ కైవసం చేసుకోగా.. మరో మూడింటిలో ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే 277 ఎలక్టోరల్ ఓట్లు దక్కించుకున్న ట్రంప్‌కు.. మరో 30 ఓట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ 315 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకుంటుందని ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.
అమెరికా అధ్యక్ష పీఠం దక్కించుకునేందుకు కీలక స్వింగ్ స్టేట్స్‌లో జార్జియా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాలు ఇప్పటికే ట్రంప్ ఖాతాలో పడ్డాయి. ఇక మిగిలిన మరో మూడు స్వింగ్ స్టేట్స్ మిషిగన్, ఆరిజోనా, నెవడా రాష్ట్రాల్లో ట్రంప్ ముందజలో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్.. జార్జియా, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, కాన్సస్, అయోవా, మోంటానా, యుటా, నార్త్ డకోటా, వయోమింగ్, సౌత్ డకోటా, నెబ్రాస్కా, ఓక్లహోమా, టెక్సాస్, ఆర్కాన్సాస్, లూసియానా, ఇండియానా, కెంటకీ, టెన్నెసీ, మిస్సోరి, మిసిసిపి, ఒహాయో, వెస్ట్ వర్జీనియా, అలబామా, సౌత్ కరోలినా, ఫ్లోరిడా, ఐడహో, విస్కాన్సిన్ రాష్ట్రాలను దక్కించుకున్నారు.
మరోవైపు.. అమెరికా ఎన్నికల ఫలితాల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.. 224 ఎలక్టోరల్ సీట్లను మాత్రమే దక్కించుకుని వెనుకబడ్డారు. కాలిఫోర్నియా, ఓరెగన్, వాషింగ్టన్, న్యూ మెక్సికో, వర్జీనియా, ఇల్లినోయీ, న్యూజెర్సీ, మేరీల్యాండ్, వెర్మాంట్, న్యూయార్క్, కనెక్టికట్, డెలవేర్, మసాచుసెట్స్, రోడ్ ఐల్యాండ్, కొలరాడో, హవాయి, న్యూహ్యాంప్‌షైర్, మిన్నెసోటా, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా రాష్ట్రాలు కమలా హారిస్ ఖాతాలో పడ్డాయి.
డొనాల్డ్ ట్రంప్ గెలిచిన రాష్ట్రాల్లో వచ్చిన ఎలక్టోరల్ ఓట్లు
టెక్సాస్ 40, ఫ్లోరిడా 30, పెన్సిల్వేనియా 19, ఒహాయో 17, నార్త్ కరోలినా 16, జార్జియా 16, టెన్నెసీ 11, ఇండియానా 11, విస్కాన్సిన్ 10, మిస్సోరి 10, అలబామా 9, సౌత్ కరోలినా 9, కెంటకీ 8, లూసియానా 8, ఓక్లహోమా 7, ఆర్కాన్సాస్ 6, అయోవా 6, కాన్సస్ 6, మిసిసిపి 6, యుటా 6, వెస్ట్ వర్జీనియా 4, మోంటానా 4, ఐడహో 4, నెబ్రాస్కా 4, వయోమింగ్ 3, నార్త్ డకోటా 3, సౌత్ డకోటా 3, మైన్ 1
కమలా హారిస్ గెలిచిన రాష్ట్రాల్లో వచ్చిన ఎలక్టోరల్ ఓట్లు
కాలిఫోర్నియా 54, న్యూయార్క్ 28, ఇల్లినోయీ 19, న్యూజెర్సీ 14, వర్జినియా 13, వాషింగ్టన్ 12, మసాచుసెట్స్ 11, మేరీల్యాండ్ 10, కొలరాడో 10, మిన్నెసోటా 10, ఓరెగాన్ 8, కనెక్టికట్ 7, న్యూమెక్సికో 5, హవాయి 4, న్యూహ్యాంప్‌షైర్ 4, రోడ్ ఐల్యాండ్ 4, డీసీ 3, డెలవేర్ 3, వెర్మాంట్ 3, మైన్ 1, నెబ్రస్కా 1. ఇంకా నెవడా 6, మిషిగన్ 15, మైన్ 2, ఆరిజోనా 11, అలస్కా రాష్ట్రాల్లో 3 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా.. వాటి ఫలితాలు వెల్లడించాల్సి ఉంది.