అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరికొన్ని రోజుల్లో పదవి నుంచి తప్పుకోబోతున్నారు. ఈక్రమంలోనే తాను చేయాలనుకున్న పనులన్నింటినీ చకచకా చేసేస్తున్నారు. గతంలో ఆయన చెప్పినట్లుగానే అనేక మంది నేరస్తులకు శిక్ష తగ్గిస్తూ క్షమాభిక్షల పర్వం కొనసాగిస్తున్నారు. ఇటీవలే ఒక్కరోజులో 1500 మందికి క్షమాభిక్ష ప్రసాదించిన జో బైడెన్ ఈరోజు మరో 37 మందికి శిక్షను తగ్గించారు. ముఖ్యంగా మరణశిక్ష అనుభవిస్తున్న వీరికి జీవిత ఖైదును విధించారు.
ఇలా 37 మందిని మరణం నుంచి తప్పించగా.. వారంతా సంబుర పడిపోతున్నారు. కానీ శిక్షను తగ్గించుకోలేకపోయిన ఆ ముగ్గురు నిందితులు మాత్రం తాము బతికే రోజులను లెక్కపెట్టుకుంటున్నారు. ముఖ్యంగా ట్రంప్ వస్తే తమకు కచ్చితంగా శిక్ష అమలు చేస్తారని తెగ భయపడిపోతున్నారు. ఇంత మందికి శిక్ష తగ్గించిన బైడెన్.. ఆ ముగ్గురిని మాత్రం ఎందుకు వదిలేశారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పదిహేను రోజుల క్రితమే జో బైడెన్ 1500 మంది నిందితులకు క్షమాభిక్ష ప్రసాదించారు. ఒక్కరోజులోనే అంతమందికి శిక్ష తగ్గించి చరిత్రకెక్కిన బైడెన్.. అదేరోజు తన పదవి నుంచి తప్పుకునేలోపు మరింత మందికి క్షమాభిక్ష ప్రసాదిస్తానని చెప్పారు. అప్పటి నుంచి అనేక మంది.. మరణశిక్ష పడిన వారికి శిక్ష తగ్గించి జీవిత ఖైదుగా మార్చాలని అనేక విజ్ఞప్తులు చేశారు. అవన్నీ గమనించిన బైడెన్ ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజు మరింత మందికి ఉపశమం కల్పించారు. ముఖ్యంగా ఫెడరల్ మరణశిక్ష ఎదుర్కుంటున్న 40 మందిలో ఏకంగా 37 మందికి శిక్ష తగ్గించారు.
ఈక్రమంగానే ఆయన మాట్లాడుతూ.. హింసాత్మక నేరాలను తగ్గించడానికి, సమర్థవంతమైన న్యాయ వ్యవస్థను నిర్ధారించడానికి తన జీవితాన్ని అంకింత చేసినట్లు చెప్పుకొచ్చారు. జో బైడెన్ 2021లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఫెడరల్ ఉరిశిక్షలపై తాత్కాలిక నిషేధాన్ని ప్రకటించింది. ఇలా బైడెన్ పదవీ కాలం మొత్తం ఉరిశిక్షలను నిలిపివేశారు. 2020 సంవత్సరంలో ప్రచార హమీల్లో భాగంగానే ఫెడరల్ స్థాయిలో మరణశిక్షను తొలగించడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. ఆ హామీ మేరకే ఉరిశిక్షలను ఆపేశారు.
అమెరికా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా మరణశిక్ష అమలు నిబంధనలు ఉన్నాయి. కొన్ని మాత్రమే వాటిని అమలు చేస్తుండగా.. అత్యంత తీవ్ర నేరాల్లో మాత్రం ఫెడరల్ ప్రభుత్వం తరఫున మరణ శిక్షలు విధిస్తున్నారు. ఇలా 1988 నుంచి 2021 వరకు 79 మందికి మరణ శిక్ష పడగా.. కేవలం 16 మందికి శిక్ష అమలు చేశారు. 2003 నుంచి ట్రంప్ అధికారంలోకి వచ్చే వవకు ఎలాంటి శిక్షలు అమలు కాలేదు. కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లోనే 13 మందికి మరణశిక్ష విధించారు. ప్రస్తుతం 40 మంది ఈ శిక్షలు అనుభవిస్తుండగా.. 37 మందికి బైడెన్ క్షమాభిక్ష ప్రసాదించారు. కానీ బోస్డన్ మారథాన్ బాంబు దాడి కేసులో మరణశిక్ష పడ్డ ముగ్గురు దోషులకు మాత్రం బైడెన్ క్షమాభిక్ష ప్రసాదించలేదు.