రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక, రాక్షస పాలన సాగుతోందని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తెలిపారు. పాలనలో ఎక్కడా రూల్ ఆఫ్ లా కనిపించడం లేదని ఆరోపించిన ఆయన, తమ పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేసి, అకారణంగా అన్యాయంగా పోలీస్ స్టేషన్లకు పిలిపించి చిత్రహింసలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ కార్యకర్తను ఇబ్బది పెట్టినా, చట్టవిరుద్ధంగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినా, హింస పెట్టినా.. సహించేది లేదని, చట్టానికి వ్యతిరేకంగా పని చేసిన ప్రతి పోలీసు అధికారిపై చర్యలు తప్పవని పొన్నవోలు స్పష్టం చేశారు. తప్పు చేసిన పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని తేల్చి చెప్పారు. ఏ వ్యక్తి పైనా థర్డ్ డిగ్రీ ఉపయోగించే హక్కు పోలీసులకు లేదని, దాన్ని కాలరాసేలా ముందుకు వెళితే తాము తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. అన్యాయంగా కేసులు పెడితే బాధితులకు పార్టీ అండగా ఉంటుందని, లీగల్ టీమ్ సమర్థవంతంగా పని చేసి న్యాయం సమకూర్చుతుందని పొన్నవోలు భరోసా ఇచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరికైనా సరే ఇబ్బంది కలిగితే పార్టీ ఆఫీసుకు సమాచారం అందించాలని కోరిన ఆయన, రాజ్యాంగ రక్షణ అన్ని పార్టీలకు ఉంటుందని, అధికార, విపక్ష పార్టీలకు హక్కులు, చట్టాలు సమానంగా పని చేస్తాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో పార్టీ కార్యకర్తలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చిన పొన్నవోలు, రాజ్యాంగ పరమైన హక్కులు అందరికీ సమానంగా వర్తించేలా పార్టీ నిరంతరం పని చేస్తోందని అభయమిచ్చారు. సంఘటితంగా పోరాడి పార్టీని కార్యకర్తలు రక్షిస్తే, కార్యకర్తలను పార్టీ రక్షిస్తుందని చెప్పారు.