ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రంప్ ఎఫెక్ట్.. ఒక్కరోజే రూ. 8 లక్షలు పెరిగిన బిట్‌కాయిన్ ధర.. ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి!

business |  Suryaa Desk  | Published : Wed, Nov 06, 2024, 11:29 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికలపై కొద్ది రోజులుగా ప్రపంచ దేశాలు దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు వచ్చేశాయి. రిపబ్లికన్ క్యాండిడేట్, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి జయకేతనం ఎగురవేసి.. 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అమెరికా అగ్రదేశం. సాధారణంగానే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల్ని అమెరికాతో పోలుస్తుంటారు. అమెరికాలో ఏం జరిగినా.. ప్రపంచ దేశ ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం పడుతుంటుంది. ఇక ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కూడా అదే జరిగింది. ట్రంప్ గెలుపు ఖాయం కాగానే.. ఇన్ని రోజులుగా నేలచూపులు చూసిన డాలర్ పుంజుకుంది. సడెన్‌గా 4 నెలల గరిష్ట స్థాయిని తాకింది. ఇదే సమయంలో చమురు ధరలు పతనం అయ్యాయి. స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. రూపాయి విలువ పడిపోయింది. ఇక్కడే మరోసారి క్రిప్టో కరెన్సీ ట్రెండింగ్‌లోకి వచ్చింది.


అవును.. ప్రధాన క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ ధర భారీ స్థాయిలో పెరిగింది. ఇప్పుడు జీవన కాల గరిష్టాల్ని తాకడం గమనార్హం. అమెరికాలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైన సమయంలో బిట్ కాయిన్ ధర 63 వేల డాలర్లపై స్థాయిలో ఉండగా.. ఇంట్రాడేలో ఏకంగా 75 వేల డాలర్ల స్థాయికి చేరింది. ప్రస్తుతం అంటే బుధవారం రాత్రి 8 గంటల సమయంలో దీని ధర 73,770 యూఎస్ డాలర్లుగా ఉంది. భారత కరెన్సీలో ఇది రూ. 62 లక్షలకుపైనే ఉంటుంది. ఒక్కరోజులో రూ. 10 వేల డాలర్లకుపైగా పెరగ్గా.. ఇండియన్ కరెన్సీలో రూ. 8 లక్షలకుపైనే పెరిగిందన్నమాట.


ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ జోరు కొనసాగుతున్న సమయంలోనే బిట్ కాయిన్ ధర ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరింది. తర్వాత మళ్లీ స్వల్పంగా తగ్గిందని చెప్పొచ్చు. ట్రంప్ ఎప్పటినుంచో క్రిప్టో కరెన్సీకి మద్దతు ఇస్తుండటంతో దీనికి ఊతం ఇచ్చిందని చెప్పొచ్చు. ఇందులో ట్రంప్‌కు పెట్టుబడులు కూడా ఉన్నట్లు సమాచారం. చివరగా 2021లో క్రిప్టో కరెన్సీలో బాగా రాణించాయి. అప్పుడు ఆల్ టైమ్ హైని తాకాయి. తర్వాత పలు కారణాలతో భారీగా క్షీణించి.. మళ్లీ ఇటీవల పుంజుకుంటుండగా ఆ స్థాయిల్ని దాటేసింది. ఫెడ్ మళ్లీ వడ్డీ రేట్లు తగ్గిస్తుండటం కూడా క్రిప్టోకు ఊతమిస్తుందని చెబుతున్నారు నిపుణులు.


డాలర్ రికార్డు స్థాయిలో పెరగ్గా.. రూపాయి జీవనకాల కనిష్ట స్థాయికి పతనమైంది. ఇవాళ ఒక్కరోజే దాదాపు 30 పైసలు క్షీణించి రూ. 84.38 కి పడిపోయింది. డాలర్ పుంజుకోగా.. విదేశీ పెట్టుబడిదారులు ఇక్కడ పెట్టుబడుల్ని ఉపసంహరించుకోవడం ప్రధాన కారణం. వీరు తమ పెట్టుబడుల్ని బాండ్లు, డాలర్లపైకి మళ్లిస్తారు. మళ్లీ యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే.. డాలర్, బాండ్ ఈల్డ్స్‌ డిమాండ్ తగ్గి అప్పుడు మళ్లీ రూపాయి విలువ పెరిగే అవకాశం ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com