పరిపాలన చేతకాక, సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేక, వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు నానా అవస్థలు పడుతున్న కూటమి ప్రభుత్వం, వారి వైఫల్యాలను ఎత్తి చూపినందుకు తమ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ ఆక్షేపించారు. తమ పార్టీ తరపున ఎవరు మాట్లాడినా, ప్రభుత్వాన్ని ప్రశ్నించినా అక్రమంగా అరెస్ట్ చేయడం, పోలీస్ స్టేషన్లు తిప్పుతూ వేధించడం చూస్తుంటే అప్రకటిత రాష్ట్రపతి పాలన విధించారా? అనే అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వ పాలనలో విపక్ష టీడీపీ కార్యకర్తలు, ఆ పార్టీ సానుభూతిపరులు అతి దారుణంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా.. ఈ స్థాయిలో ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని తెలిపారు. అందుకు పూర్తి విరుద్ధంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్న మాజీ ఎమ్మెల్సీ, కేవలం ఈ నాలుగు నెలల్లోనే 100 మందికి పైగా కార్యకర్తలపై కేసులు పెట్టి, అరెస్టు చేసి వేధిస్తున్నారని వెల్లడించారు. తప్పులను విమర్శిస్తూ తమ పార్టీ కార్యకర్తలు పెడుతున్న పోస్టులకు ప్రభుత్వం వణుకుతోందని వ్యాఖ్యానించారు.