తెలంగాణ నుంచి ఏపీకి బదిలీపై వచ్చిన ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి కాటా.. ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టరుగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్‌తో ఆమ్రపాలి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ ఉద్యోగులు.. ఆమ్రపాలిని సత్కరించారు. ఏపీలోని విశాఖపట్నంలో ఆమ్రపాలి జన్మించారు. ఆమ్రపాలి తండ్రి వెంకటరెడ్డి ఆంధ్రా యూనివర్సిటీలో ఆర్ధికశాస్త్ర ఆచార్యులుగా పనిచేశారు. విశాఖపట్నంలో ప్రాథమిక విధ్యాభ్యాసం పూర్తి చేసిన ఆమ్రపాలి.. చెన్నైలోని ఐఐటీ మద్రాస్‌లో ఇంజనీరింగ్ పూర్తిచేశారు. ఆ తర్వాత ఐఐఎం బెంగళూరులో ఎంబీఏ పూర్తి చేశారు. యూపీఎస్సీ పరీక్షల్లో 39వ ర్యాంక్ సాధించిన ఆమ్రపాలి.. 2010 వ సంవత్సరపు బ్యాచ్ ఐఏఎస్ అధికారి. అలాగే ఐఏఎస్‌కు చిన్న వయసులోనే ఎంపికై ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
తెలంగాణలో వరంగల్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఆమ్రపాలి.. వివిధ హోదాలలో పనిచేశారు. అనంతరం కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆమ్రపాలిని తెలంగాణకు తీసుకువచ్చారు. ఆ తర్వాత తెలంగాణలో పలు హోదాల్లో పనిచేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌గానూ వ్యవహరించారు. అయితే ఐఏఎస్‌ల బదిలీపై క్యాట్ ఉత్తర్వుల మేరకు ఆమ్రపాలి సొంతరాష్ట్రమైన ఏపీకి బదిలీ అయ్యారు. క్యాట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆమ్రపాలి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు కూడా క్యాట్ తీర్పుతో ఏకీభవించింది. దీంతో గత నెలలో ఆమ్రపాలి ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేశారు.
అనంతరం అక్టోబర్ 27న ఆమ్రపాలిని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీగా ప్రభుత్వం నియమించింది. అలాగే ఏపీ టూరిజం అథారిటీ సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది. దీంతో ఇవాళ విజయవాడలోని పర్యాటక సంస్థ కార్యాలయంలో ఆమ్రపాలి కాటా ఏపీటీడీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన వాణీ ప్రసాద్‌ను కార్మికశాఖ ముఖ్య కార్యదర్శిగా, వాకాటి కరుణను ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌గా నియమిస్తూ ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.