మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. ఇది ప్రతి నెలా పెరుగుతూనే ఉంటుందని చెప్పొచ్చు. రోజురోజుకూ కొత్త కొత్త రికార్డుల్ని సృష్టిస్తూనే ఉన్నాయి. ఈ మేరకు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా డేటా స్పష్టం చేస్తోంది. మ్యూచువల్ ఫండ్లలోకి కొత్తగా వస్తున్న ఇన్వెస్ట్‌మెంట్లు అన్నీ ఎక్కువగా ఈక్విటీ స్కీమ్స్‌కు చెందినవే ఉంటున్నాయి. దాదాపు 87 శాతం మంది ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్లు.. ఈక్విటీ ఓరియెంటెడ్ పథకాల్లోనే పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 2023 సెప్టెంబరులో మ్యూచువల్ ఫండ్ల ఆస్తుల్లో వీటి విలువ 54.1 శాతంగా ఉండగా.. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి అది 61 శాతానికి పెరిగింది.
ఇప్పుడు మనం గత 10 సంవత్సరాల వ్యవధిలో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ సెగ్మెంట్‌లో సిప్ పెట్టుబడులతో రిటర్న్స్ ఏ స్కీమ్‌లో ఎంత వచ్చాయో తెలుసుకుందాం. ముందుగా ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ గురించి చూద్దాం. ఈ ఫండ్ సైజ్ రూ. 34,217 కోట్లుగా ఉంది. 2024, సెప్టెంబర్ 30 వరకు డేటా ఇది. ఇందులో పదేళ్ల కాలానికి సగటున 23.50 శాతం రాబడి రాగా.. సిప్ పెట్టుబడులతో అయితే సగటు రిటర్న్స్ 23.68 శాతంగా ఉంది. అంటే పదేళ్ల కిందట రూ. 10 వేల సిప్ ప్రారంభించిన వారికి ఇప్పుడు చేతికి రూ. 42.85 లక్షలు వచ్చాయి.
ఎస్బీఐ కన్సమ్షన్ అపార్చునిటీస్ ఫండ్ పరిమాణం రూ. 3101 కోట్లుగా ఉండగా.. దీంట్లో పదేళ్ల వార్షిక రాబడి 18.13 శాతం.. సిప్ రిటర్న్స్ 20.64 శాతంగా ఉంది. దీంట్లో 10 వేల సిప్ పెట్టినవారికి పదేళ్లలో చేతికి రూ. 36.29 లక్షలు వచ్చాయి.
SBI మాగ్నమ్ మిడ్‌క్యాప్ ఫండ్ ఆస్తుల విలువ రూ. 22,338 కోట్లుగా ఉంది. ఇక్కడ సగటున వార్షిక ప్రాతిపదికన 18.01 శాతం రాబడి రాగా.. సిప్ రిటర్న్స్ 20.2 శాతంగా ఉంది. దీంట్లో నెలకు రూ. 10 వేల మేర పొదుపు చేసిన వారికి పదేళ్లలో రూ. 35.42 లక్షలు అయ్యేవి.
మరోవైపు ఎస్బీఐ టెక్నాలజీ అపార్చునిటీస్ ఫండ్‌లో పరిమాణం రూ. 4435 కోట్లుగా ఉంది. ఇక్కడ పదేళ్ల రిటర్న్స్ సగటున 17.75 శాతం, సిప్ రాబడి 21.83 శాతంగా ఉంది. 10 వేల సిప్‌కు ఇక్కడ రూ. 38.73 లక్షలు వచ్చాయి. ఎస్బీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ పరిమాణం రూ. 5071 కోట్లు. పదేళ్ల రాబడి 17.70 శాతం.. సిప్‌లో 21.77 శాతం వచ్చింది. దీంట్లో కూడా 10 వేల సిప్‌పై రూ. 38.61 లక్షలు వచ్చాయి.