దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తుంగలోకి తొక్కి, రాజ్యాంగ హక్కులను, చట్టాలను ఖాతరు చేయకుండా అన్యాయంగా, అకారణంగా తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై నమోదు చేస్తున్న కేసులను న్యాయబద్దంగా ఎదుర్కొంటామని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (లీగల్ వ్యవహారాలు) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ప్రకటించారు. చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్న పోలీసులు అధికారుల్లో ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమన్న వారు, ఖాకీ దుస్తులు వేసుకున్నంత మాత్రాన చట్టానికి అతీతులేం కాదని తేల్చి చెప్పారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్, వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (లీగల్ వ్యవహారాలు) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం పరిటాలకు చెందిన ఒక వాట్సప్ గ్రూప్‌లో ఉన్న 100 మందిపై ఒకేసారి కేసు నమోదు చేశారని, దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రూప్ అడ్మిన్‌తో పాటు, నాలుగు మండలాలకు చెందిన వారిని దారుణంగా వేధిస్తున్నారని వైయస్ఆర్‌సీపీ నేతలు వెల్లడించారు. వాట్సప్‌గ్రూప్ సభ్యులను సోషల్ యాక్టివిస్టులుగా ముద్ర వేసి అర్థరాత్రి సమయాల్లో స్టేషన్లకు పిలుస్తున్న పోలీసులు వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆదేశాలతోనే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు.