సరస్వతి పవర్ భూముల్లో ప్రతి సెంటూ కొనుగోలు చేసిందే అని, అక్కడ ఒక్క ఎకరం కూడా ప్రభుత్వ భూమి లేదని ఎమ్మార్వో నిర్ధారించి నివేదిక ఇచ్చినా, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ మాత్రం.. అక్కడ ప్రభుత్వ, అటవీ భూములున్నాయని, అసలు వెయ్యి ఎకరాలు ఎలా సేకరించారని అంటూ, తప్పుడు ఆరోపణలతో నిందిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ఆక్షేపించారు. ప్రభుత్వ అసమర్థత నుంచి డైవర్ట్ చేయడం కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న దాడులు, అరాచకాలు, మహిళల మీద అత్యాచారాలను అదుపు చేయలేక, శాంతి భద్రతల వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ సరస్వతి భూముల్లోకి వచ్చి హడావుడి చేసి వెళ్లారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి పల్నాడు జిల్లా పర్యటనకు వచ్చిన పవన్, ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటిస్తారని అనుకుంటే.. ప్రతిపక్ష నాయకుడి మీద బురద జల్లడానికి ఇంత దూరం వచ్చారా? అని స్థానిక ప్రజలు ఉసూరుమన్నారని ఆయన తెలిపారు.