యూఎస్ ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ జోరు కొనసాగుతుండగా..బిట్ కాయిన్ ధర ఆల్ టైమ్ రికార్డు గరిష్టస్థాయికి చేరుకుంది. బుధవారం ( నవంబర్6న) బిట్ కాయిన్ ధర గరిష్టంగా 75వేల యూఎస్ డాలర్లకు చేరుకుంది. క్రిప్టో కరెన్సీకి ట్రంప్ సపోర్టు చేస్తుండటంతో..గత రికార్డు 73వేల 750 అమెరికన్ డాలర్లను అధిగమించింది. బిట్ కాయిన్ 8.4 శాతం పెరిగి 75వేల 060 యూఎస్ డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.అదనంగా ఈథర్ 7.2 శాతం పెరిగి 2వేల 576 యూఎస్ డాలర్లకు చేరుకుంది. క్రిప్టో కరెన్సీపై ట్రంప్ అనుకూలంగా ఉండటంతో మార్కెట్లో సానుకూల స్పందన ఉందని తెలుస్తోంది. బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.445 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. దీంతో అతిపెద్ద క్రిప్టో కరెన్సీగా నిలిచింది. 24గంటల ట్రేడింగ్ వ్యాల్యూమ్ 40.89 శాతం పెరిగి 59.26 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మరోవైపు యూఎస్ ఎన్నికల ఫలితాలు ట్రంప్ కు అనుకూలంగా రావడంతో డాలర్ ఇండెక్స్ కూడా బలపడింది. యూరో, యెన్ లతో సహా ఆరు ప్రధాన కరెన్సీలతో పోలిస్తే 1.25 శాతం పెరిగి 104.72కి పెరిగింది. ఇమ్మిగ్రేషన్ పరిమితులు, పన్ను తగ్గింపులు, సుంకాలపై ట్రంప్ ప్రతిపాదన విధానాలు బాండ్ ఈల్డ్ లను గణనీయంగా పెంచుతాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.