నెల్లూరుకు చెందిన వృద్ధురాలి హత్య, చెన్నై సమీపంలో డెడ్‌బాడీ దొరకడం కలకలం రేపింది. ఈ కేసులో తండ్రి, కూతురిని పోలీసులు అరెస్ట్ చేశారు.. వీరిద్దరిని ప్రశ్నిస్తే సంచలన విషయాలు బయటపడ్డాయి. నెల్లూరు సంతపేట రాజేంద్రనగర్‌లో మణ్యం రమణి (65) మురుగేశం దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి నలుగురు పిల్లలు. ఆమె సోమవారం ఉదయం రమణి కూరగాయల కొనుగోలు చేసేందుకు వెళ్లి.. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించినా ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇంతలో చెన్నై మీంజూరు రైల్వే పోలీసులు నెల్లూరు సంతపేట పోలీసులకు అర్ధరాత్రి ఫోన్ చేశారు. సూట్ కేసులో వృద్ధురాలి మృతదేహం ఉందని.. నెల్లూరు రాజేంద్రనగర్‌కు చెందిన బాలసుబ్రహ్మణ్యం, ఆయన కుమార్తె దీనిని తీసుకొచ్చారని.. ఇద్దరిని తాము అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మృతదేహం ఫొటోను పరిశీలించిన నెల్లూరు పోలీసులు.. కనిపించకుండా పోయిన రమణిగా గుర్తించార. ఆ తండ్రీ కుమార్తెలను పోలీసులు ప్రశ్నించగా.. కీలక విషయాలను చెప్పారు.
బంగారం పనిచేసే బాలసుబ్రహ్మణ్యం కుటుంబం గతంలో నెల్లూరులో రమణి ఇంటి సమీపంలో ఉండేది.. ఆ సమయంలో పరిచయం ఉంది. బాలసుబ్రహ్మణ్య కొద్ది కాలం క్రితం అదే ప్రాంతంలోని మరో అపార్ట్‌మెంట్‌కి మకాం మార్చారు.. ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఈ సమస్యల నుంచి ఎలాగైనా బయటపడాలని భావించారు. అప్పుడే రమణి బంగారు ఆభరణాలు కనిపించాయి.. వాటిని ఎలాగైనా దోచేయాలని ప్లాన్ చేశారు. వెంటనే ప్లాన్ రెడీ చేసుకున్నారు.. రెండు, మూడు రోజులుగా ఆమె కదలికల్ని గమనించారు. వృద్ధురాలు సోమవారం ఉదయం కూరగాయలకు వెళ్లగా.. ఆమెతో మాటలు కలిపారు. తమ ఇంటికి రావాలని ఆహ్వానించారు. ఆమె కూడా గతంలో పరిచయం ఉన్న వ్యక్తులే కదా అని నమ్మి వెళ్లింది.
ఇంటికి వెళ్లిన తర్వాత ఆమెను తాడుతో గొంతు బిగించి హత్య చేశారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలనున తీసుకున్నారు. బాలసుబ్రహ్మణ్యం ఆ తర్వాత రమణి మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి సూట్‌కేస్‌లో కుక్కాడు. ఈ విషయాన్ని కుమార్తెకు కూడా చెప్పాడు.. సాయంత్రం సుబ్రహ్మణ్యం ఆయన కుమార్తెతో కలిసి ఊరెళుతున్నామని అందరికి చెప్పి ఆటోలో సంతపేట నుంచి సౌత్ రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. అక్కడి నుంచి చెన్నై వెళ్లే ప్యాసింజర్ ఎక్కారు.. మార్గ మధ్యలో ఎక్కడైనా ఆ సూట్‌కేస్‌ను పడేయాలని ప్లాన్ చేశారు. అయితే రైలులో రద్దీగా ఉండటంతో వీళ్ల ప్లాన్ వర్కౌట్ కాలేదు.. సూట్‌కేసును బయటపడేసేందుకు వీలు కాలేదు. ఈలోపే ప్యాసింజర్ రైలు చెన్నై మీంజూరు స్టేషన్‌కు చేరుకోగా.. అక్కడ వీరిద్దరు దిగారు. సూట్‌కేస్‌తో సహా మళ్లీ నెల్లూరు వెళ్లే రైలు ఎక్కి మార్గం మధ్యలో సూట్‌కేస్ బయటపడేయాలని భావించారు.
మీంజూరు రైల్వే స్టేషన్‌లో తండ్రి, కూతురి ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించగా.. సూట్‌కేసు నుంచి రక్తం కారడాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. వెంటనే ఇద్దర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తడబడ్డారు.. ఇద్దరు పొంతనలేని సమాధానం చెప్పారు. ఆ తర్వాత బంగారు ఆభరణాల కోసమే రమణిని హత్య చేసినట్లు అంగీకరించారు. మీంజూరు పోలీసులు వెంటనే నెల్లూరు సంతపేట పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు రమణి కుటుంబ సభ్యులతో కలిసి మీంజూరు స్టేషన్‌కు వెళ్లారు. అక్కడి అధికారులతో మాట్లాడి.. స్థానిక ఆసుపత్రిలో రమణి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అయితే ఈ హత్య నెల్లూరులో జరగడంతో.. త్వరలోనే కేసును అక్కడికి బదిలీ చేస్తామని తమిళనాడు పోలీసులు తెలిపారు. హత్య జరిగిన సమయంలో బాల సుబ్రహ్మణ్యం భార్య కూడా ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారంలో ఆమె ప్రమేయం ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.