విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికకు ఏపీ హైకోర్టు బ్రేక్ వేసింది. ఇందుకూరి రఘురాజుపై వేసిన అనర్హత వేటును ఏపీ హైకోర్టు రద్దు చేసింది. ఇందుకూరి రఘురాజు సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. శాసనమండలి ఛైర్మన్ జారీ చేసిన అనర్హత ఉత్తర్వులు రద్దుచేసిన హైకోర్టు.. వాదనలు చెప్పుకునేందుకు రఘురాజుకు అవకాశం ఇవ్వలేదని అభిప్రాయపడింది. ఈ వ్యవహారాన్ని మళ్లీ మండలి ఛైర్మన్ వద్దకు పంపింది. నిర్ణయం ప్రకటించే వరకూ సభ్యత్వం పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నవంబర్ 28న విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చింది. నవంబర్ 4న నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 28న పోలింగ్ నిర్వహించనున్నట్లు షెడ్యూలు కూడా వెల్లడించారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం విజయనగరం ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్ రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన ఇందుకూరి రఘురాజు పదవీకాలం 2027 నవంబర్ 31 వరకూ ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారంటూ ఇందుకూరి రఘురాజుపై వైసీపీ శాసనమండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసింది.
పార్టీ ఫిరాయింపుపై వైసీపీ ఫిర్యాదు చేయగా.. మండలి చైర్మన్ మోషేన్ రాజు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఇందుకూరి రఘురాజుకు నోటీసులు ఇచ్చారు. అయితే ఆ తర్వాత రఘురాజు వివరణ ఇవ్వలేదంటూ ఆయనపై అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో తన వివరణ ఇవ్వకుండానే అనర్హత వేటు వేశారంటూ రఘురాజు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారించిన ఏపీ హైకోర్టు.. మండలి ఛైర్మన్ ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది.
అయితే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో వైసీపీ విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని సైతం ఖరారు చేసింది. మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత శంబంగి వెంకట చిన అప్పల నాయుడు పేరును జగన్ ఖరారు చేశారు. అయితే చిన అప్పలనాయుడు అభ్యర్తిత్వాన్ని వైఎస్ జగన్ ఖరారు చేసిన కాసేపటికే.. ఏపీ హైకోర్టు ఇందుకూరి రఘురాజుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల్లో వైసీపీకి పూర్తిస్థాయిలో మెజారిటీ ఉంది. దీంతో ఎన్నికల్లో సులువుగా గెలుస్తారని భావించారు. అయితే ఊహించని విధంగా ఇందుకూరి రఘురాజుకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది.