విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైసీపీ తరుఫున పోటీచేసేదెవరో తేలిపోయింది. ఈ సీటు కోసం ముగ్గురు నేతలు పోటీపడినట్లు తెలిసింది. అయితే విజయనగరం జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో వైఎస్ జగన్ తన మససులో మాటను బయటపెట్టారు. విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా శంబంగి వెంకట చిన అప్పలనాయుడు పేరును ప్రకటించారు. గతంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన చిన అప్పలనాయుడును ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్ జగన్ ఖరారు చేశారు. ఈ సీటు కోసం మాజీ మంత్రి పుష్ప శ్రీ వాణి, పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్ రాజుతో పాటుగా చిన అప్పలనాయుడు పోటీపడగా.. చివరకు అప్పలనాయుడువైపే జగన్ మొగ్గు చూపారు.
మరోవైపు విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 4న నోటిఫికేషన్ విడుదల కాగా.. 11 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 12 నామినేషన్ల పరిశీలన, 14 వరకూ ఉపసంహరణ గడవు ఉంది. నవంబర్ 28న పోలింగ్ జరగనుంది. ఆ రోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు ఓటింగ్ జరుగుతుంది.
మరోవైపు వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు పడటంతో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన పార్టీ మారారంటూ ఇందుకూరి రఘురాజు పార్టీ ఫిరాయింపుపై వైసీపీ మండలి చైర్మన్ మోషేన్ రాజుకు ఫిర్యాదు చేసింది. దీంతో మండలి చైర్మన్ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని రఘురాజుకు నోటీసులు ఇచ్చారు. అయితే ఇందుకూరి రఘురాజు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వకపోవటంతో అనర్హత వేటు వేసింది. దీంతో జూన్ 3 నుంచి ఈ స్థానం ఖాళీగా ఉంది. దీంతో ఉప ఎన్నిక జరుగుతోంది. మరోవైపు విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 753 ఓట్లు ఉండగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 548 సభ్యుల బలం ఉంది. తెలుగుదేశం పార్టీకి 168 మంది, ఇతరులు 16 మంది ఉన్నారు.