అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌నకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటుగా వివిధ దేశాల అధినేతలు ట్రంప్‌నకు అభినందనలు తెలియజేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ట్రంప్‌నకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. అమెరికాను ముందుకు నడిపించడంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడు అయిన సందర్భంలోనూ భారత్ అమెరికా దేశాల మధ్య సంబంధాలు బలోపేతమయ్యాయన్న చంద్రబాబు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ట్రంప్ నాయకత్వంలో ఇరుదేశాల సంబంధాలు అత్యున్నతస్థాయికి చేరుతాయని చంద్రబాబు ఆకాంక్షించారు. రెండు దేశాలు పరస్పర సహకారాన్ని పెంపొందించుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
మరోవైపు డొనాల్డ్ ట్రంప్‌నకు ఐటీ మంత్రి నారా లోకేష్ కూడా అభినందనలు తెలియజేశారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించనుండటం చరిత్రాత్మకమని అభిప్రాయపడ్డారు. ట్రంప్ గెలుపు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో ప్రత్యేకమైన సందర్భమని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. మరీ ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు ఇదెంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడిగా నియమితులు కానుండటం ఆ జిల్లా వాసులకు ప్రత్యేకమైన సందర్భమని లోకేష్ అభిప్రాయపడ్డారు. జేడీ వాన్స్ సతీమణి ఉషా కుటుంబం మూలాలు ఏపీలో ఉండటంతో నారా లోకేష్ ఈ రకంగా ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మూలాలున్న వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా పలు రంగాల్లో తమదైన ముద్ర వేస్తుండటం ఎంతో గర్వంగా ఉందని రాసుకొచ్చారు.
మరోవైపు ఉషా చిలుకూరి అమెరికాలో పుట్టి పెరిగినప్పటికీ ఆమె పూర్వీకులది కృష్ణా జిల్లా పామర్రుకి దగ్గర్లోని గ్రామం. 1980లో ఉషా చిలుకూరి తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి అమెరికా వలస వెళ్లారు. కాలిఫోర్నియాలోని శాండియాగోలో జన్మించిన ఉషా చిలుకూరి.. యేల్ యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ పూర్తి చేశారు. యేల్ లా స్కూల్‌లో ఉన్న సమయంలోనే జేడీ వాన్స్‌తో పరిచయం కాగా.. 2014లో కెంటకీలో హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. జేడీ వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఉషా చిలుకూరి అమెరికా సెకండ్ లేడీగా నిలవనున్నారు.