పారిస్ ఒలింపిక్స్ లో 10 రోజులు ముగిశాయి. 11వ రోజు కోట్ల మంది ఎదురు చూస్తున్న ఈవెంట్ రాబోతోంది. టోక్యోలో అసలు అంచనాలు లేకుండా దిగి ఏకంగా గోల్డ్ మెడల్ సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. మంగళవారం (ఆగస్ట్ 6) తొలిసారి తలపడబోతున్నాడు. అతనితోపాటు ఇండియన్ హాకీ టీమ్ కూడా సెమీఫైనల్లో ఆడనుంది. ఇప్పుడు అందరి కళ్లూ నీరజ్ చోప్రాపైనే ఉన్నాయి. జావెలిన్ త్రోలో అతడు ఈసారి కూడా గోల్డ్ తెస్తాడన్న ఆశతో అభిమానులు ఉన్నారు. తొలి పది రోజుల్లో కేవలం 3 పతకాలతో సరిపెట్టుకున్న ఇండియా.. చివరి ఐదు రోజుల్లో ఏం చేస్తుందో అన్న ఆసక్తి నెలకొంది. నీరజ్ తోపాటు ఇండియన్ హాకీ టీమ్, రెజ్లర్లు, వెయిట్ లిఫ్టర్లు మెడల్స్ పై ఆశలు రేపుతున్నారు.
నీరజ్ చోప్రా మంగళవారం ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్ మధ్యాహ్నం 3.20 గంటల నుంచి ప్రారంభం కానుంది. అతడు ఇందులో అర్హత సాధిస్తే గురువారం (ఆగస్ట్ 8) జరగబోయే ఫైనల్లో తలపడతాడు. ఈసారి నీరజ్ తోపాటు ఇదే జావెలిన్ ఈవెంట్లో ఇండియా నుంచి కిశోర్ జేనా కూడా పోటీ పడుతున్నాడు. దీంతో క్వాలిఫికేషన్ రౌండ్ అస్సలు మిస్ కావద్దు.