మీరు కొత్త లోన్ కోసం చూస్తున్నారా. అయితే మీ సిబిల్ స్కోర్(Cibil Score) ఇంకా నెల రోజుల నుంచి అప్‌డేట్ కాలేదని టెంన్షన్ పడుతున్నారా. ఇకపై ఆ టెన్షన్ అక్కర్లేదు.ఎందుకంటే ఇక నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి ఆ వివరాలను అప్‌డేట్ చేయనున్నారు. మీరు మీ లోన్స్ ఈఎంఐలు సమయానికి చెల్లించినా, చెల్లించకపోయినా కూడా ఆ వివరాలను ప్రతి 15 రోజులకు ఒకసారి మార్పు చేస్తారు. అయితే ఏవరైనా లోన్ తీసుకుని EMIని సకాలంలో చెల్లించకపోతే అది వారి క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీని ద్వారా వారు భవిష్యత్తులో రుణం తీసుకోవడం కష్టమవుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటివల సిబిల్(CIBIL) స్కోర్‌కు సంబంధించి బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఈ మేరకు కొత్త సూచనలను జారీ చేసింది.
RBI కొత్త రూల్ ప్రకారం కస్టమర్ల క్రెడిట్ స్కోర్ (CIBIL) ప్రతి 15 రోజులకు మారుతుంది. ఈ నేపథ్యంలో క్రెడిట్ స్కోర్‌లను త్వరగా అప్‌డేట్ చేయాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలను ఆర్‌బీఐ ఆదేశించింది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవలే ఈ విషయాన్ని ప్రకటించారు. అలాగే కస్టమర్ల క్రెడిట్ సమాచారాన్ని ప్రతి రెండు వారాలకు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు (CIC) పంపాలని తెలిపింది. ఆ క్రమంలో ఇది క్రెడిట్ స్కోర్‌ను వేగంగా అప్‌డేట్ చేసేలా చేస్తుంది. దీని ద్వారా ఇటు బ్యాంకులు, మరోవైపు కస్టమర్‌లకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీని ద్వారా EMIలు సక్రమంగా చెల్లించిన వారికి లోన్స్ త్వరగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఈ క్రమంలో కస్టమర్ల CIBIL స్కోర్‌ను ప్రతి నెల 15వ తేదీన లేదా నెలాఖరున అప్‌డేట్ చేస్తారు. క్రెడిట్ ఇన్‌స్టిట్యూషన్‌లు (CI), క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు (CIC) కూడా 15 రోజుల వ్యవధిలో డేటాను అప్‌డేట్ చేయడానికి వారి స్వంత నిర్ణీత తేదీలను నిర్ణయించుకుంటాయి. క్రెడిట్ సంస్థలు ప్రతి నెలా CICకి కస్టమర్ క్రెడిట్ సమాచారాన్ని సమర్పించడం తప్పనిసరి. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు క్రెడిట్ సమాచారం చాలా ముఖ్యం. కాబట్టి ఈ దశలో లోన్ తీసుకునేవారికి, రుణదాతలకు ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుంది.
ఈ సమాచారం వల్ల ఎవరికి రుణం ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనే విషయంలో కూడా ఆయా సంస్థలు మెరుగైన నిర్ణయాలు తీసుకోగలుగుతాయి. రుణ వడ్డీ రేటును నిర్ణయించడంలో కూడా సహాయపడుతుంది. మంచి క్రెడిట్ స్కోర్‌లు ఉన్న కస్టమర్లకు తక్కువ రేట్లకు రుణాలు లభిస్తాయి. క్రెడిట్ స్కోర్‌ను ప్రతి 15 రోజులకు అప్‌డేట్ చేస్తే బ్యాంకులకు కస్టమర్‌ల ఖచ్చితమైన డేటా అందుబాటులో ఉంటుంది. దీంతో ఏ ఖాతాదారుడు రుణాన్ని తిరిగి చెల్లించగలడు, ఏవరు చెల్లించలేదో అర్థం చేసుకోగలుగుతారు. ఆ విధంగా ఇది డిఫాల్ట్‌ల సంఖ్యను కూడా తగ్గించగలదని అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే వ్యత్యాసం తక్కువగా ఉంటే కస్టమర్ల గురించి త్వరగా తెలిసిపోయే అవకాశం ఉంటుంది.