ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్రీగానే వంటగ్యాస్ సిలిండర్, స్టవ్.. రూ. 300 సబ్సిడీ కూడా

business |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2024, 11:02 PM

దాదాపు అన్ని వర్గాల ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాల్ని తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మహిళలు, ఉద్యోగులు, వృద్ధులు, నిరుద్యోగులు ఇలా ఎవరైనా కావొచ్చు.. వారికి అనుగుణంగా స్కీమ్స్ తెస్తోంది. ఇక ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం.. మహిళల పేరిట ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అందిస్తుంది. దీని కింద గ్యాస్ సిలిండర్, స్టవ్ ఉచితంగానే వస్తుంది. ఇంకా వీటిపై సబ్సిడీ కూడా ఉంటుంది. ఇదే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY). ఈ స్కీమ్ కింద సంవత్సరానికి 12 గ్యాస్ సిలిండర్ల వరకు రూ. 300 చొప్పున రాయితీ (సబ్సిడీ) కూడా అందిస్తుంది. ఇప్పటికే ఈ స్కీమ్ కింద 10 కోట్ల 33 లక్షలకుపైగా కుటుంబాలు లబ్ధి పొందాయి.


గతేడాది కేంద్ర ప్రభుత్వం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్ని భారీగా తగ్గించింది. రాఖీ గిఫ్ట్‌గా రూ. 200 చొప్పున తగ్గించగా.. అదే సమయంలో ఉజ్వల స్కీమ్ కింద రాయితీని రూ. 200 నుంచి రూ. 300 కు పెంచింది. ఇంకా.. కొత్తగా ఉజ్వల స్కీమ్ కింద రానున్న మూడేళ్లలో 75 లక్షల వరకు కొత్త కనెక్షన్స్ ఇస్తామని తెలిపింది. ఇక తర్వాత మరోసారి ఈ ఏడాది విమెన్స్ డే సందర్భంగా మరో రూ. 100 తగ్గించింది. ఇక ఈ ఉజ్వల పథకం 2016 మే 1న ఉత్తర్ ప్రదేశ్ బాలియాలో.. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైంది.


ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి, దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారికి మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది. ఉజ్వల స్కీమ్ దరఖాస్తుదారులు కచ్చితంగా మహిళ అయి ఉండాలి. అర్హత వయసు 18 ఏళ్లు దాటితే చాలు.. ఈ స్కీం కోసం అప్లై చేసుకోవచ్చు. కుటుంబ వార్షిక ఆదాయం లక్ష లోపు ఉండాలి. అప్పటివరకు ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉండొద్దు. బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఇంట్లో వారి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు అవసరం పడతాయి. ఏ LPG గ్యాస్ డిస్ట్రిబ్యూటర్‌నైనా ఎంచుకోవచ్చు.


ఈ పథకం కోసం అప్లై చేసుకోవాలంటే ముందుగా ఈ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. అక్కడ కొత్త కనెక్షన్ కోసం అన్నదానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా డిస్ట్రిబ్యూటర్‌ను ఎంచుకోవాలి (ఇండేన్/హెచ్‌పీ గ్యాస్/భారత్ గ్యాస్). తర్వాత రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేసి.. కస్టమర్ పేరు, మొబైల్ నంబర్, ఇ- మెయిల్, క్యాప్చా కోడ్ సహా ఇతర వివరాలు ఎంటర్ చేయాలి. స్క్రీన్‌పై ఒక అప్లికేషన్ ఫారం ఉంటుంది.. దానిని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీస్కొని వివరాలు నింపాలి. దానిని సదరు ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్‌కు అందించాల్సి ఉంటుంది. తర్వాత మీ వివరాలు ధ్రువీకరించి కనెక్షన్ ఇస్తారు. ఉజ్వల స్కీమ్ కింద మొదట స్టవ్, సిలిండర్ ఫ్రీగానే వస్తుంది. తర్వాతి నుంచి గ్యాస్ సిలిండర్‌పై రూ. 300 సబ్సిడీ వస్తుంది. ఏటా 12 సిలిండర్లపై రాయితీ వర్తిస్తుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com