ఐపీఎల్‌లో అమలు చేస్తున్న 'ఇంపాక్ట్ ప్లేయర్'రూల్ సరికాదంటూ టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు చేసిన వ్యాఖ్యలను దిగ్గజ బౌలర్, లక్నో సూపర్ జెయింట్ మెంటార్ జహీర్ ఖాన్ తప్పుబట్టాడు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కారణంగా భారత అనామక ఆటగాళ్లకు అవకాశాలు దక్కుతున్నాయని అభిప్రాయపడ్డాడు. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలతో జహీర్ ఖాన్ ఏకీభవించాడు.
సయ్యిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2023లో ప్రయోగాత్మకంగా పరిచయం చేసిన ఈ నిబంధనను ఐపీఎల్ 2023 సీజన్‌లో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ప్రతి జట్టూ మ్యాచ్‌కు ముందు ఐదుగురు 'ఇంపాక్ట్ సబ్'లను ప్రకటించి వారిలో ఒకరిని మ్యాచ్‌లో పరిస్థితులకు అనుగుణంగా తుదిజట్టులో ఉండే ఆటగాళ్ల స్థానంలో ఆడించొచ్చు. దీని వల్ల ఐపీఎల్ జట్లు తమ అవసరానికి తగ్గట్టుగా ఆటగాళ్లను వాడుకుంటున్నాయి.
అయితే ఈ ఇంపాక్ట్ రూల్ కారణంగా ఆల్‌రౌండర్లకు అన్యాయం జరుగుతుందని, ఈ రూల్ తనకు నచ్చలేదని ఐపీఎల్ 2024 సందర్భంగా రోహిత్ శర్మ అన్నాడు. 'ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ నాకు నచ్చలేదు. నేను దీనికి పెద్ద అభిమానిని కాను. కొంతమందికి వినోదాన్ని అందించడం కోసం ఇలా చేయడం సరికాదు. ఈ నిబంధన భారత ఆల్‌రౌండర్ల ఎదుగుదలకు తీవ్ర నష్టం చేకూరుస్తోంది. క్రికెట్ అనేది 11 మందితో ఆడాలి గానీ 12 మందితో కాదు" అని రోహిత్ శర్మ ఘాటుగా వ్యాఖ్యానించాడు.
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై రోహిత్ శర్మ అభిప్రాయంతో ఏకీభవించిన విరాట్ కోహ్లీ.. ఈ నిబంధన కారణంగా బౌలర్లు నష్టపోతున్నారని తెలిపాడు. బ్యాట్, బంతి మధ్య సమతూకమైన పోటీ ఉండాలని తెలిపాడు. తాజాగా ఈ రూల్ గురించి అశ్విన్.. క్రిష్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానెల్‌లో చర్చించాడు. ఇంపాక్ట్ రూల్.. టీమ్ వ్యూహాలకు మరింత విలువ ఇస్తుందన్నాడు. ఆల్‌రౌండర్ల ఎదుగుదలకు అండగా ఉందనే వాదన సరికాదన్నాడు. ఈ రోజుల్లో ఎవరీ టాలెంట్‌ను అడ్డుకోలేమని తెలిపాడు.
ఈ నిబంధనతో దూబె, ధ్రువ్ జురెల్ వంటి ప్లేయర్లు అవకాశాలు దక్కించుకుని భారత జట్టులోకి కూడా వచ్చారని అశ్విన్ గుర్తు చేశాడు. ''ఇక షాబాజ్ అహ్మద్, శివమ్ దూబె, ధ్రువ్ జురెల్ వంటి ఆటగాళ్లు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ లేకపోతే అంతగా అవకాశాలు వచ్చేవి కావు. చాలా మంది ఆటగాళ్లకు ఈ రూల్ అవకాశం కల్పిస్తుంది. అయితే అలా జరగడానికి ఇదే ఏకైక మార్గం అని చెప్పట్లేదు. కానీ ఈ రూల్ అంత చెడ్డది కాదని నా అభిప్రాయం'' అని అశ్విన్ పేర్కొన్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా నియమితులైన జహీర్ ఖాన్.. బుధవారం ఆ జట్టు నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై స్పందించిన ఆయన.. అశ్విన్ అభిప్రాయంతో ఏకభవించాడు. రోహిత్, కోహ్లీ వాదనను తప్పుబట్టాడు.
'ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల అనామక భారత ఆటగాళ్లకు అవకాశాలు దక్కుతున్నాయి. ఈ రూల్ కారణంగా భారత క్రికెట్ ఎంతో మెరుగైంది. అనామక ఆటగాళ్లకు భారత జట్టు తరఫున ఆడే అవకాశం దక్కింది. ఇంపాక్ట్ సబ్ వల్ల ఆల్‌రౌండర్లకు అన్యాయం జరుగుతుందనే వాదన సరికాదు. జెన్యూన్ ఆల్‌రౌండర్లను ఎవరూ అడ్డుకోలేరు. బ్యాట్, బంతితో ఆడే సామర్థ్యం ఉన్న ఆటగాడు జట్టుకు విలువైన ఆస్థిగా మారుతాడు.'అని జహీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు.