పారిస్ పారాలింపిక్స్‌లో 25 పతకాలు సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత బృందం అదరగొడుతోంది. తొలిరోజు పతకాలు సాధించలేకపోయినప్పటికీ.. రెండో రోజు మాత్రం రెండు గంటల వ్యవధిలో నాలుగు పతకాలు సాధించింది. షూటింగ్‌లో స్వర్ణం సాధించిన అవనీ లేఖరా.. భారత్ పతకాల ఖాతాను ఘనంగా తెరిచింది. అదే ఈవెంట్‌లో మరో షూటర్ మోనా అగర్వాల్‌కు సైతం కాంస్యం దక్కింది. పరుగు పందెంలో ప్రీతిపాల్ కాంస్యం నెగ్గింది. ఆ తర్వాత షూటర్ మనీశ్ నర్వాల్ రజతంతో మెరిశాడు.
టోక్యో 2020 పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన పారా షూటర్ అవనీ లేఖరా మరోసారి అదే ప్రదర్శన పునరావృతం చేసింది. పారిస్ 2024 పారాలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్ 1లో స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. దీంతో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించింది. ఫైనల్‌లో అవనీ లేఖరా.. అత్యధికంగా 249.7 స్కోరును నమోదు చేసి స్వర్ణాన్ని కొల్లగొట్టింది. ఇదే ఈవెంట్‌లో భారత్‌కు చెందిన మోనా అగర్వాల్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. మోనా అగర్వాల్ 228.7 స్కోరు నమోదు చేసింది.
పరుగులోనూ పతకం..
పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ పరుగులో మూడో పతకం దక్కింది. మహిళల 100మీటర్ల టీ35 విభాగం ఫైనల్‌లో ప్రీతిపాల్ మూడో స్థానం దక్కించుకుంది. 14.21 సెకన్లలో తన రేసును ముగించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ ఈవెంట్‌లో చైనాకు చెందిన అథ్లెట్లు తొలి రెండు స్థానాల్లో నిలిచి.. స్వర్ణ, రజత పతకాలు దక్కించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన ప్రీతిపాల్.. ఒక రైతు కుటుంబంలో జన్మించింది. ఆమెకు పుట్టుకతోనే శారీరక సమస్యలు ఉండగా.. కాళ్లలో శక్తి కోసం పలు ట్రీట్‌మెంట్ తీసుకుంటోంది.
షూటింగ్‌లో ఒకేరోజు మూడు పతకాలు..
పారిస్ పారాలింపిక్స్‌లో రెండో రోజు భారత్ నిమిషాల వ్యవధిలోనే తొలి మూడు పతకాలు సాధించింది. ఆ తర్వాత కాసేపటికే నాలుగో పతకం కూడా భారత ఖాతాలో చేరింది. షూటర్ మనీశ్ నర్వాల్ 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 ఫైనల్లో సత్తాచాటాడు. తృటిలో స్వర్ణ పతకాన్ని కోల్పోయాడు. 3 పాయింట్ల తేడాతో గోల్డ్ మెడల్ చేజార్చుకున్నాడు. కొరియా పారా షూటర్ జియోంగ్డు జో స్వర్ణం సాధించాడు. మనీశ్ 234.9 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించాడు. దీంతో భారత్ ఖాతాలో పారిస్ పారాలింపిక్స్‌లో తొలి రజతం చేరింది. మొత్తంగా పతకాల సంఖ్య 4కు పెరిగింది. ఈ పతకాలన్నీ రెండు గంటల వ్యవధిలోనే రావడం గమనార్హం.