పారిస్ 2024 పారాలింపిక్స్‌లో భారత్ పతకాల పంట పండిస్తోంది. పోటీలు ప్రారంభమైన మూడో రోజు నాటికే ఖాతాలో ఐదు పతకాలను వేసుకుంది. రెండో రోజైన శుక్రవారం ఏకంగా నాలుగు పతకాలు రాగా.. మూడో రోజైన శనివారం ఒక కాంస్య పతకం దక్కింది. దీంతో మొత్తం పతకాల సంఖ్య ఐదుకు చేరింది. ఇందులో నాలుగు పతకాలు షూటింగ్‌లోనే రావడం గమనార్హం.
భారత్‌కు చెందిన 25 ఏళ్ల మహిళా షూటర్ రుబీనా ఫ్రాన్సిస్ పారిస్ 2024 పారాలింపిక్స్‌లో కాంస్యం పతకాన్ని కైసవం చేసుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 ఫైనల్‌లో మూడో స్థానంలో నిలిచి ఈ ఫీట్ సాధించింది. ఫైనల్‌లో రుబీనా 211.1 స్కోరు నమోదు చేసింది. ఈ ఈవెంట్‌లో 236.8 స్కోరుతో ఇరాన్‌కు చెందిన జవాన్మార్డి సారె స్వర్ణం సాధించింది. తుర్కియోకు చెందిన 46 ఏళ్ల ఐసెల్ ఓజ్గాన్ 231.1 స్కోరుతో రజత పతకాన్ని దక్కించుకుంది.
కాగా పారిస్ 2024లో 25 పతకాలు సాధించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో మూడోరోజు నాటికే 20% లక్ష్యాన్ని చేరుకుంది. మిగతా రోజుల్లో ఇంకో 20 పతకాలు సాధిస్తే.. భారత బృందం నిర్దేశించుకున్న లక్ష్యం నెరవేరినట్లే. కాగా పారిస్ 2024 పారాలింపిక్స్‌లో భారత్ శుక్రవారం నాలుగు పతకాలు సాధించింది. టోక్యో 2020 పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన పారా షూటర్ అవనీ లేఖరా పారిస్‌లోనూ అదే పునరావృతం చేసింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్ 1లో గోల్డ్ మెడల్ సాధించింది. ఇదే ఈవెంట్‌లో భారత్‌కు చెందిన మోనా అగర్వాల్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని అందించింది.
ఇక పారిస్ 2024 పారాలింపిక్స్‌లో మూడో పతకం భారత్‌కు పరుగులో దక్కింది. మహిళల 100 మీటర్ల టీ35 విభాగం ఫైనల్‌లో ప్రీతిపాల్ కాంస్యం సాధించింది. 14.21 సెకన్లలో తన రేసును ముగించి ఫైనల్‌లో మూడో ప్లేసులో నిలిచింది. ఇక భారత్‌కు నాలుగో పతకం కూడా షూటింగ్‌లోనే దక్కింది. షూటర్ మనీశ్ నర్వాల్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 ఈవెంట్‌లో రజత పతకాన్ని సాధించాడు. కేవలం 3 పాయింట్ల తేడాతో స్వర్ణం సాధించే బంగారు అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. ఇక శనివారం నాటికి భారత్ పారిస్ పారాలింపిక్స్‌లో 5 పతకాలు సాధించింది. అందులో 1 స్వర్ణం, 1 రజతం, 3 కాంస్య పతకాలు ఉన్నాయి. మరోవైపు బ్యాడ్మింటన్‌లో భారత్ మరో పతకాన్ని ఖాయం చేసుకుంది. పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్4 ఈవెంట్‌లో భారత్‌కు చెందిన సుకాంత్ కదమ్, సుహాస్ యతిరాజ్ సెమీ ఫైనల్‌కు చేరుకున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఈ జోడి స్వర్ణం లేదా రజతం సాధించే అవకాశం ఉంది.