ప్రస్తుత క్రికెట్‌లో మంచినీళ్లు తాగినంత ఈజీగా సిక్స్‌లు కొట్టే బ్యాటర్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు నికోలస్ పూరన్. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న దాదాపు అన్ని టీ20 టోర్నీల్లో పాల్గొనే పూరన్.. అలవోకగా సిక్స్‌లు కొట్టేస్తాడు. బౌలర్ ఎవరన్నది చూడకుండా.. బంతిని స్టాండ్స్‌లోకి పంపిస్తాడు. ప్రత్యర్థి బౌలర్లకు నిద్రలేకుండా చేస్తాడు. ఈ తరహా విన్యాసాలు అతడు ఎన్నోసార్లు చేశాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ అరుదైన రికార్డును పూరన్ బద్దలు కొట్టాడు. సుమారు 10 ఏళ్లుగా భద్రంగా ఉన్న యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేశాడు.
‘సిక్సర్ల కింగ్’గా పేరు పొందిన ఈ బ్యాటర్ ప్రస్తుతం కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం ఓ అరుదైన రికార్డును బ్రేక్ చేశాడు. ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న నికోలస్ పూరన్.. సెయింట్ కిట్స్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పెను విధ్వంసం సృష్టించాడు. 43 బంతుల్లోనే ఏకంగా 7 ఫోర్లు, 9 సిక్స్‌లు కొట్టి 97 రన్స్ రాబట్టాడు. ఈ మ్యాచ్‌లో కొట్టిన సిక్సర్ల ద్వారా ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఈ ఫార్మాట్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన వీరుడిగా నిలిచాడు. ఈ క్రమంలోనే వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్‌గేల్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.
క్రిస్ గేల్ 2015 సంవత్సరంలో 135 సిక్స్‌లు కొట్టాడు. ఈ ఏడాది 36 మ్యాచ్‌లు ఆడిన గేల్.. ఈ ఫీట్ సాధించాడు. గేల్‌తో పోలిస్తే పూరన్ ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. పూరన్ ఈ ఏడాది ఇప్పటివరకు 58 మ్యాచ్‌లు ఆడి 139 సార్లు బంతిని స్టాండ్స్‌లోకి పంపించాడు. క్రిస్‌గేల్ పదేళ్ల నాటి రికార్డును బ్రేక్ చేశాడు.
కాగా ఒకే ఏడాది టీ20 క్రికెట్‌లో వందకు పైగా సిక్సర్లు కొట్టిన ప్లేయర్లలో పూరన్ కంటే ముందు.. మరో ఇద్దరు వెస్టిండీస్ క్రికెటర్లు ఉన్నారు. అందులో ఏకంగా క్రిస్ గేల్ ఆరు సార్లు వందకు పైగా సిక్స్‌లు కొట్టాడు. 2015లో 135 సిక్స్‌లు కొట్టిన గేల్ ఆ తర్వాత వరుసగా.. 2012లో 121, 2011లో 116, 2016లో 112, 2017లో 101, 2013లో 100 సిక్స్‌లు కొట్టాడు. వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు ఆండ్రీ రస్సెల్ సైతం ఈ క్లబ్‌లో చేరాడు. 2019లో అతడు 101 సిక్సర్లు కొట్టాడు. కాగా ఈ ఏడాది 8 నెలల్లోనే పూరన్.. 139 సిక్స్‌లు కొట్టాడు. మిగతా నాలుగు నెలల్లో అతడు కనీసం మరో 50 సిక్స్‌లు కొడతాడనే అంచనాలు ఉన్నాయి.