ఇటీవలే భారత టీ20 జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్ నియమితుడైన విషయం తెలిసిందే. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో అతడి సారథ్యంలోనే భారత్ బరిలోకి దిగి 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే తాను కేవలం ఏదో ఒక ఫార్మాట్‌కు పరిమితం కావాలని అనుకోవడం లేదని.. భారత్ తరఫున అన్ని ఫార్మాట్‌లలో ఆడాలని ఉందని సూర్యకుమార్ ఇటీవల వ్యాఖ్యానించాడు. వచ్చే ఆరు నెలల్లో టీమిండియా ఎక్కువగా టెస్టు మ్యాచ్‌లు ఆడనుండటంతో.. సుదీర్ఘఫార్మాట్‌లో చోటు సంపాదించాలని సూర్య కలలు కన్నాడు. అందుకు అనుగుణంగా దేశవాళీ టోర్నీలో పాల్గొని సత్తాచాటాలని భావించాడు. కానీ టెస్టు జట్టులోకి రావాలనుకున్న సూర్యకుమార్ యాదవ్‌కుకు నిరీక్షణ తప్పేలా లేదు. ముంబై తరఫున బుచ్చిబాబు టోర్నమెంట్ ఆడుతున్న ఈ స్టైలిష్ బ్యాటర్ అనూహ్యంగా గాయపడ్డాడు.
దులీప్ ట్రోఫీకి ముందు జరిగే బుచ్చిబాటు టోర్నీలో ఆడతానని సూర్యకుమార్ ఇది వరకే ప్రకటించాడు. అందుకు అనుగుణంగానే బరిలోకి దిగాడు. అయితే తమిళనాడు జట్టుతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మూడో రోజు ఫీల్డింగ్ చేస్తుండగా సూర్యకుమార్ యాదవ్ కుడి చేతికి గాయమైంది. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన అతడు మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టలేదు. గాయం తీవ్రత ఎక్కువ ఉండడంతో సూర్యకుమార్ నాలుగో రోజు బ్యాటింగ్‌కే దిగలేదు. తొలి ఇన్నింగ్స్‌లో మాత్రం సూర్యకుమార్ 30 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో తమిళనాడు చేతిలో ముంబై జట్టు 286 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది.
మ్యాచ్ ఫలితాన్ని పక్కనపెడితే.. సూర్యకుమార్ గాయం తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అతడు కోలుకునేందుకు సమయం పట్టొచ్చని సమాచారం. సెప్టెంబర్ 19 నుంచి భారత జట్టు బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. దీని కంటే ముందే సెప్టెంబర్ 3 నుంచి దులీప్ ట్రోఫీ జరగనుంది. కానీ స్కై.. ఈ రెండు సిరీస్‌లకు దూరమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే.. సుదీర్ఘ ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలన్న సూర్యకుమార్ కోరిక ఇప్పట్లో నెరవేరే అవకాశం లేనట్లే.
కాగా 2023 ఫిబ్రవరిలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ద్వారా సూర్యకుమార్ భారత్ తరఫున టెస్టుల్లో డెబ్యూ చేశాడు. భారత్ వేదికగా జరిగిన ఈ సిరీస్‌లో కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత మాత్రం అతడికి టెస్టు జట్టులో చోటు దక్కలేదు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌తో టీమిండియాలో చోటు దక్కించుకోవాలని భావించినా.. అతడి కల నెరవేరుతుందా లేదా అనేది డైలమాలో పడింది. మరో వారం రోజుల్లో బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు భారత జట్టును ఎంపిక చేసే అవకాశం ఉంది. అప్పటివరకు సూర్య ఫిట్‌నెస్ సాధిస్తే.. జట్టులోకి ఎంపిక చేసే విషయాన్ని సెలక్టర్లు పరిగణలోకి తీసుకోవచ్చు.