భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్‌కు ఈ రోజు (సెప్టెంబర్ 19) ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పాలి. ఎందుకంటే ఏకంగా 634 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత అతడు టెస్ట్ క్రికెట్‌లో పునరాగమనం చేశాడు. పంత్ చివరిసారిగా డిసెంబర్ 2022లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత రోడ్డు ప్రమాదానికి గురవడంతో క్రికెట్‌కు దూరమయ్యాడు. తిరిగి కోలుకున్నాక చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో ప్రస్తుతం జరుగుతున్న తొలి టెస్టులో రీ ఎంట్రీ ఇచ్చాడు.దాదాపు రెండేళ్ల తర్వాత బ్యాటింగ్ చేసిన పంత్ మొదటి పరుగు సాధించడానికి 7 బంతులు ఆడాడు. భారత్ 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన క్లిష్ట పరిస్థితిలో బ్యాటింగ్‌కు వచ్చిన ఫర్వాలేదనిపించాడు. యశస్వి జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ప్రత్యర్థి బంగ్లా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని 39 పరుగులు రాబట్టాడు. అయితే వ్యక్తిగత స్కోరు 19 పరుగుల వద్ద పంత్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండవ భారతీయ వికెట్ కీపర్‌గా అతడు నిలిచాడు. ఈ జాబితాలో మాజీ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ 17092 పరుగులతో నంబర్ 1 స్థానంలో కొనసాగుతుండగా.. 4020 పరుగులతో పంత్ నంబర్2 స్థానంలో నిలిచాడు.