సెప్టెంబరు మొదటి వారంలో సంభవించిన వరదలు ఏపీలోని పలు ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. 40 మందికి పైగా మృత్యువాతపడ్డారు. లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. తీవ్రస్థాయిలో ఆస్తి నష్టం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీగా విరాళాలు అందుతున్నాయి. తాజాగా అదానీ గ్రూప్ భారీ విరాళం ప్రకటించింది. వరద బాధితుల సహాయార్థం రూ.25 కోట్లు అందిస్తున్నట్టు అదానీ ఫౌండేషన్ చైర్ పర్సన్ డాక్టర్ ప్రీతి అదానీ ప్రకటించారు. ఈ క్రమంలో నేడు ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీ రూ.25 కోట్ల విరాళం తాలూకు పత్రాలు అందించారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ... అదానీ ఫౌండేషన్ చైర్ పర్సన్ ప్రీతి అదానీకి, అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీకి కృతజ్ఞతలు తెలియజేశారు. వరద బీభత్సంతో కుదేలైన రాష్ట్ర ప్రజల జీవితాలను మళ్లీ నిలబెట్టడంలో మీ విరాళం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అంటూ అదానీ గ్రూప్ ను ఉద్దేశించి చంద్రబాబు ట్వీట్ చేశారు.