డిపాజిట్లను ఆకర్షించేందుకు బ్యాంకులు చర్యలు తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్మన్ సీఎస్ శెట్టి కీలక ప్రకటన చేశారు. తమ బ్యాంకులో డబ్బులు దాచుకునేందుకు డిపాజిటర్లను ఆకర్షించేలా సరికొత్త, వినూత్నమైన పథకాలు తీసుకొస్తామన్నారు. అందులో రికరింగ్ డిపాజిట్లు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ వంటివి సైతం ఉంటాయన్నారు. పీటీఐతో ఇంటర్వ్యూ సందర్భంగా తమ బ్యాంక్ ప్రణాళికలను వెల్లడించారు ఛైర్మన్ సీఎస్ శెట్టి. ఆర్థికంగా అవగాహన కలిగి, విభిన్న పెట్టుబడి ఆప్షన్ల కోసం చూస్తున్న కస్టమర్ల అభివృద్ధి చెందుతున్న ఆర్థిక అవసరాలను తీర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని నొక్కి చెప్పారు.
ఆర్థిక వ్యవస్థ పురోగమనిస్తున్న క్రమంలో కస్టమర్లు ఆస్తుల కేటాయింపుపై ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారని, వారి పెట్టుబడులలో విలువను కోరుకుంటున్నారని ఎస్‌బీఐ ఛైర్మన్ సీఎస్ శెట్టి పేర్కొన్నారు. సాధారణంగా ఎవరూ మొత్తం డబ్బులను రిస్క్ ఉన్న మార్గంలో పెట్టుబడి పెట్టరని, వారికి ప్రత్యామ్నాయంగా బ్యాంకింగ్ ఉత్పత్తులు ఎల్లప్పుడు మంచి ఎంపికగా ఉంటాయన్నారు. అందుకే వారిని ఆకర్షించేందుకు కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రికరింగ్ డిపాజిట్ల వంటి సంప్రదాయ బ్యాంకింగ్ ఉత్పత్తులను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అలాగే ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, సిప్ పెట్టుబడుల ఫీచర్లను మేళవించి ఒక కాంబో ప్రొడక్ట్ తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. అలాగే వాటిని డిజిటల్ విధానంలో యాక్సెస్ చేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. ఈ వినూత్నమైన ఉత్పత్తులను ప్రధానంగా యంగ్ కస్టమర్లు జనరేషన్ జడ్ కస్టమర్లను ఆకర్షించేలా రూపొందిస్తామన్నారు.
డిపాజిట్ల సమీకరణలో కస్టమర్ సేవ, వడ్డీ రేట్లు ముఖ్యమైన పాతర్ పోషిస్తాయని తెలిపారు ఛైర్మన్ సీఎస్ శెట్టి. అయినప్పటికీ తాము వడ్డీ రేట్ల వార్‌లో ఇతర బ్యాంకులతో పోటీపడేందుకు ఇష్టపడమని పేర్కొన్నారు. ఎస్‌బీఐ ప్రధానంగా సమతుల్య వడ్డీ రేట్లు, ఉన్నతమైన కస్టమర్ సేవలను అందించడంపైనే ఉందని తెలిపారు. డిజిటల్ బ్యాంకింగ్‌లోను ఎస్‌బీఐ గణనీయమైన పురోగతిని సాధించిందని తెలిపారు. తమ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో 50 శాతానికిపైగా డిజిటల్ ఛానళ్ల ద్వారానే జరుగుతున్నట్లు గుర్తు చేశారు. ప్రతి రోజు 50 వేల నుంచి 60 వేల సేవింగ్స్ ఖాతాలు తెరుస్తున్నట్లు చెప్పారు. అందులో చాలా వరకు డిజిటల్ విధానంలోనే ఉంటున్నాయన్నారు.