ప్రస్తుత రోజుల్లో ఇంట్లో బైక్ ఉండడం అనేది సర్వసాధారణమే. ఇంట్లో ఉండే వారందరూ ఉపయోగించుకునేలా అన్ని విధాల అనువైన ద్విచక్రవాహనాలను కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. చిన్న వాహనాలను కాదని అధిక సామర్థ్యం కలిగిన బైక్స్ కావాలంటున్నారూ యువత. ధర ఎక్కువైనా అదే తీసుకోవాలని పట్టుబడుతున్నారు. తమకు నచ్చిన కంపెనీ బైక్‌ను మోజుపడి కొనుగోలు చేస్తున్నారు. యువత ఆసక్తుల ఆధారంగానే దేశీయ మోటార్ సైకిళ్ల మార్కెట్లో కొత్త కొత్త మోడళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. కంపెనీలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ప్రీమియం బైకులనే ఆవిష్కరిస్తున్నాయి. ప్రస్తుతం ప్రీమియం బైకుల వాటా పెరుగుతుండడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.
ద్విచక్ర వాహనాల్లో 100సీసీ నుంచి 350 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం గల బైక్స్ ఉన్నాయి. ఎక్కువ మైలేజీ రావాలని మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా 100 సీసీ బైక్స్ కొంటారు. 150 సీసీ ఆపైన ఇంజిన్ సామర్థ్యం ఉన్న బైకులను ప్రీమియం లేదా లగ్జరీ బైక్స్ అంటారు. కొన్నేళ్ల క్రితం వీటిపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ధనవంతుల ఇళ్లల్లోనే ఈ బైక్స్ కనబడేవి. అయితే, ఇటీవల ప్రీమియం బైక్స్ కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయి. దీంతో కంపెనీలు సైతం ఆ దిశగా దృష్టి సారిస్తున్నాయి. దేశంలో మోటార్ సైకిళ్ల విక్రయాల్లో ప్రీమియం బైక్స్ వాటా ప్రస్తుతం 19 శాతంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అది 2029 నాటికి 28 శాతానికి చేరుతుందని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఇక్రా పేర్కొంది. ప్రీమియం మోటార్ సైకిళ్లవ విభాగంలో వచ్చే 5 ఏళ్లలో రెండంకెల వృద్ధికి అవకాశం ఉందని పేర్కొంది.
ప్రస్తుతం దేశంలో దసరా- దీపావళి పండగల సీజన్ నడుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే పెళ్లిళ్ల సీజన్ మొదలు కానుంది. ఈ క్రమంలో ప్రీమియం మోటార్ సైకిళ్లు, లగ్జరీ వాచీలు, ఖరీదైన ఆభరణాలు, పర్సుల అమ్మకాలు భారీగా జరుగుతాయి. స్పోర్ట్స్, క్రూయిజ్ బైకుల అమ్మకాలు సైతం అధికంగానే ఉంటాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. దీంతో కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అధిక వృద్ధి సాధిస్తున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. ప్రజల తలసరి ఆదాయం వేగంగా పెరుగుతోంది. దీంతో కొనుగోలు శక్తి పెరిగి ఖరీదైన నాణ్యమైన అధిక సామర్థ్యం గల వాహనాలు, వస్తువులు కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. దేశంలో యువత ఎక్కుగా ఉన్నారు. వారు ఇష్టపడే వస్తువుల్లో మోటార్ సైకిల్ అగ్రస్థానంలో ఉంటుంది. యువత ఆసక్తికి తగిన విధంగా దేశీయ కంపెనీలు ప్రీమియం మోటార్ సైకిళ్లను విడుదల చేస్తున్నాయి. కొత్తగా మార్కెట్‌లోకి వస్తున్న మోడళ్లలో 75 శాతం లగ్జరీ బైక్స్ ఉండడం గమనార్హం.