హైదరాబాద్ నగరంలో సొంతింటి కల నెరవేర్చుకునేందుకు లక్షల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. సిటీ మధ్యలో అయితే కోట్లల్లో ధరలు పలుకుతున్నాయి. దీంతో చాలా మంది నగర శివార్లలో బడ్జెట్ ధరల్లో దొరికే ప్రాంతాలకు వెళ్తున్నారు. ఓఆర్ఆర్ వరకు నివాస కేంద్రాలు ఏర్పడుతున్నాయి. కొందరు పని ప్రదేశాలకు దూరమనే భావనతో సిటీ మధ్యలోనే అందుబాటు ధరలో ఎక్కడ దొరుకుతాయోనని అన్వేషిస్తున్నారు. అలాంటి వారందరికీ ఇప్పుడు బాలానగర్ ప్రాంతం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. బాలానగర్ చుట్టుపక్కల ప్రాంతంపై అందరి దృష్టి మళ్లింది. ఎందుకంటే ఇక్కడ అందుబాటు ధరల్లోనే ఇళ్లు, అపార్ట్‌మెంట్లు లభిస్తున్నాయి.
పారిశ్రామిక ప్రాంతంగా హైదరాబాద్ నగరవాసులకు బాలానగర్ సుపరిచితమే. కేంద్ర ప్రభుత్వ సంస్థలు చాలానే ఇక్కడ ఉన్నాయి. ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ వంటి సంస్థలకు వందల ఎకరాల భూములు ఉన్నాయి. పారిశ్రామిక ప్రాంతం కావడంతో గతంలో పెద్దగా నివాసాలు రాలేదు. కానీ, బాలానగర్ దాటి చింతల్, గుండ్లపోచంపల్లి వంటి ప్రాంతల వరకు గేటెడ్ కమ్యూనిటీలు విస్తరించాయి. కొద్ది కాలంకో సిటీ మధ్యలోని పారిశ్రామిక ప్రాంతాలు క్రమంగా నివాస ప్రాంతాలుగా మారుతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో బాలానగర్ చేరిపోయింది. బాలానగర్ పేరుతో మెట్రో స్టేషన్ వచ్చింది. జీహెచ్ఎంసీ నిర్మించిన ఫ్లైఓవర్‌తో ట్రాఫిక్ సమస్యలు తప్పాయి. మాల్స్, మల్టీప్లెక్సులూ వస్తున్నాయి. చుట్టు పక్కల ఐడీపీఎల్ భూములు ఉండడంతో పచ్చని వాతావరణం ఉంది. సిటీ మధ్యలో అడవిని తలపిస్తోంది.
ప్రముఖ పాఠశాలలు, హాస్పిటల్స్, ఇంజినీరింగ్ కాలేజీలు ఓఆర్ఆర్ చేరువలోనే ఉన్నాయి. కూకట్‌పల్లి వై జంక్షన్ మెట్రో స్టేషన్ నుంచి అన్ని ప్రాంతాలకు మెరుగైన రవాణా సదుపాయాలు ఉన్నాయి. 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐటీ కారిడార్ చేరుకునేందుకు రహదారులు ఉన్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సైతం త్వరగానే చేరుకోవచ్చు. సిటీ మధ్యలో ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కూకట్ పల్లి వై జంక్షన్ నుంచి బాలానగర్ నర్సాపూర్ రోడ్డు వరకు పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణం జరుగుతోంది. మరిన్ని కొత్త ప్రాజెక్టులు వస్తున్నట్లు సమాచారం. సిటీ మధ్యలో ఐటీ కారిడార్‌కు సమీపంలో ఉన్న ప్రాంతం ఇప్పుడు ఇది ఒక్కటేనని బిల్డర్లు చెబుతున్నారు. ఓఆర్ఆర్ ప్రాంతంలో ఉన్న ధరలకే ఇక్కడ ఫ్లాట్లు లభిస్తున్నాయని చెబుతున్నారు. ఐటీ ఉద్యోగులు, ఇతర ప్రైవేట్ సంస్థల్లోని ఉద్యోగులు, వ్యాపారస్థులు ఇంట్ల ఫ్లాట్లు కొంటున్నారని చెబుతున్నారు.