రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పంట సాయం అందిస్తోంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా ప్రతి ఏడాది రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. అక్టోబర్ 5, 2024 రోజున 18వ విడత నిధులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. ఒక్కొక్కరి ఖాతాలో రూ.2 వేల చొప్పున జమ చేశారు. అయితే కొందరు రైతుల ఖాతాల్లో డబ్బులు పడలేదని తెలుస్తోంది. దీంతో పంట సాయం రాని రైతులు అయోమయంలో పడిపోయారు. తమకు రూ. 2 వేలు ఎందుకు రాలేదోనని కంగారు పడుతున్నారు. అయితే, పీఎం కిసాన్ సాయం రాకపోవడానికి చాలా కారణాలే ఉంటాయి. అవేంటి, రైతులు ఏం చేయాలి? అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు పొందాలంటే రైతులు తప్పకుండా ఇ-కేవైసీ పూర్తి చేయాలి. ఇ-కేవైసీ పూర్తి చేసిన వారికే డబ్బులు జమ అవుతాయి. మీరు ఇంకా చేయకుంటే మీసేవా కేంద్రానికి వెళ్లి చేయొచ్చు. లేదా ఆన్లైన్ ద్వారా పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా పూర్తి చేయవచ్చు. అలాగే పీఎం కిసాన్ మొబైల్ యాప్ ఉపయోగించి ఫేషియల్ అథెంటికేషన్ ద్వారా చేయొచ్చు.
అలాగే పీఎం కిసాన్ స్కీమ్‌కు లింక్ చేసిన బ్యాంక్ ఖాతాకు ఆధార్ నంబర్ లింక్ అయి ఉండాలి. ఆ పని చేయని రైతులు వెంటనే బ్యాంకుకు వెళ్లి పూర్తి చేయడం మంచిది. ఆధార్ లింక్ అయితేనే డబ్బులు ఖాతాలో పడతాయని గుర్తుంచుకోవాలి. అలాగే పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేస్తున్నప్పుడు మీ భూమి పత్రాలు సరిగా ఇచ్చారో లేదో చెక్ చేసుకోవాలి. సరిగా అప్లోడ్ చేసిన వారికే భూమికి తగినట్లుగా డబ్బులు అందుతాయి. పీఎం కిసాన్ డబ్బులు రాని వారు ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకు 011-24300606 హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా ఫిర్యాదును నమోదు చేయాలి. పీఎం కిసాన్ టోల్ ఫ్రీ నంబర్ 18001155266,155261 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసుకోవచ్చు.
పీఎం కిసాన్ యోజనను 2019లో కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. ఏడాదికి రూ.6 వేల చొప్పున మూడు విడతల్లో రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోంది. ఒక్కో విడతలో రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లోనే నేరుగా జమ చేస్తూ వస్తోంది. ఇప్పటి వరకు 18 విడతల్లో నిధులను విడుదల చేసింది. అక్టోబర్ 5వ తేదీనే రైతులకు 18 వ ఇన్‌స్టాల్మెంట్ నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు.