ఇటీవల బంగ్లాదేశ్ జట్టు పాకిస్థాన్ ను వారి సొంతగడ్డపైనే టెస్టు సిరీస్ లో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. అదే బంగ్లాదేశ్ జట్టు భారత్ పర్యటనకు వచ్చి వరుసగా ఓటములు చవిచూస్తోంది. టెస్టు సిరీస్ లో వరుసగా రెండు టెస్టుల్లోనూ ఓటమిపాలైన బంగ్లాదేశ్... నిన్న జరిగిన తొలి టీ20 మ్యాచ్ లోనూ టీమిండియాపై పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో, పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం బాసిత్ అలీ స్పందించాడు. పాకిస్థాన్ జట్టును చిత్తుగా ఓడించిన బంగ్లాదేశ్ జట్టు ఇదేనా? పాకిస్థాన్ ఓడిపోయింది ఇలాంటి జట్టు చేతిలోనా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. టీమిండియాతో రెండో టెస్టులో రెండున్నర రోజుల ఆట వర్షార్పణం కాగా, ఏడు సెషన్ల పాటు జరిగిన ఆ టెస్టులోనూ బంగ్లాదేశ్ ఓడిపోయిందని వివరించారు. నిన్న జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఆటతీరు మరీ ఘోరం అని బాసిత్ అలీ విమర్శించారు. నిన్న ఆడింది టీమిండియా సీనియర్ జట్టు కూడా కాదని, అయినప్పటికీ భారత్ బలంగా కనిపించిందని తెలిపారు. గిల్, జైస్వాల్, పంత్, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ వంటి ఆటగాళ్లు లేకపోయినా... టీమిండియాకు బంగ్లాదేశ్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయిందని వ్యాఖ్యానించారు.