టాటా గ్రూప్ దిగ్గజ సంస్థ, ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 రెండో త్రైమాసికంలో కంపెనీ 5 శాతం నికర లాభాన్ని నమోదు చేసినట్లు తెలిపింది. ఈ ఏడాది జులై- సెప్టెంబర్ క్వార్టర్‌లో టీసీఎస్ కంపెనీకి రూ.11,909 కోట్ల నికర లాభం వచ్చినట్లు తెలిపింది. అయితే, గత ఏడాది 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో కంపెనీకి రూ.11,342 కోట్ల నికర లాభం రాగా.. దాంతో పోలిస్తే 5 శాతం పెరిగింది. ఈ మేరకు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో త్రైమాసిక ఫలితాల వివరాలు వెల్లడించింది.
టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా తుది శ్వాస విడిచిన క్రమంలో కంపెనీ తన ప్రెస్ కాన్ఫరెన్సు రద్దు చేసుకుంది. ఐటీ, టెక్ రంగంలో పరిస్థితులు చక్కబడి ప్రాజెక్టులు వస్తున్న క్రమంలో ఈసారి టీసీఎస్ మంచి ఫలితాలను ప్రకటిస్తుందని అంచనా వేశారు. అయితే, ఆ అంచనాలను అందుకోలేకపోయింది టీసీఎస్. స్వల్ప లాభంతో ఫలితాలను వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ నికర లాభం పెరగడం ఐటీ సేవల సంస్థలు పుంజుకునే అవకాశాలున్నాయని అంచనా వేయొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇక టీసీఎస్ ఆదాయం విషయానికి వస్తే గత ఏడాది రెండో త్రైమాసికంతో పోలిస్తే 8 శాతం వృద్ధి సాధించింది. ప్రస్తుత రెండో త్రైమాసికంలో రూ.64,259 కోట్ల ఆదాయం నమోదైనట్లు టీసీఎస్ వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ ఆదాయం రూ.60 వేల 698 కోట్లుగా ఉంది. మరోవైపు.. క్యూ2 ఫలితాల సందర్భంగా తమ షేర్ హోల్డర్లకు శుభవార్త అందించింది టీసీఎస్. ఒక్కో షేరుకు రూ.10 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఈ డివిడెండ్ చెల్లించేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించి రికార్డ్ తేదీని అక్టోబర్ 18గా కంపెనీ నిర్ణయించింది. అర్హులైన షేర్ హోల్డర్లను గుర్తించిన తర్వాత నవంబర్ 5వ తేదీన డివిడెండ్ చెల్లించనున్నారు. అయితే, ఫలితాల ప్రకటన నేపథ్యంలో బీఎస్ఈ స్టాక్ ఎక్స్చేంజీలో టీసీఎస్ షేరు ఇవాళ 0.56 శాతం నష్టంతో రూ.4228.40 వద్ద ముగిసింది.