టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా అకాల మరణంతో ఆయన వారసుడు ఎవరు? అనే చర్చకు తెరపడింది. టాటా ట్రస్ట్ ఛైర్మన్‌గా ఆయన సవతి సోదరుడు నోయెల్ టాటాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నాయకత్వంపై సుదీర్ఘంగా చర్చించిన టాటా ట్రస్ట్ సభ్యులు.. చివరకు నోయల్‌ను ఖరారు చేశారు. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ ట్రస్టుల నిర్వహణలో నోయెల్ కీలక వ్యక్తిగా ఎదిగారు. ఇటీవలి కాలంలో అయన టాటా ట్రస్ట్‌లలో ముఖ్యమైన బాధ్యతలను నిర్వహించారు.
నావల్ టాటా, సైమన్ టాటాల కుమారుడే నోయెల్. అంటే రతన్ టాటాకు ఆయన సవతి సోదరుడు. 1957లో జన్మించిన నోయల్.. ససెక్స్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీని అందుకున్నారు. INSEADలోనూ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ (IEP)ని కూడా పూర్తి చేశారు. ట్రెంట్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా.. టాటా స్టీల్, టైటాన్ కంపెనీ లిమిటెడ్ వైస్ చైర్మన్ పదవులు సహా పలు టాటా గ్రూప్ కంపెనీల బోర్డులలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
ప్రస్తుతం టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఛైర్మన్‌గా, నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. దీనికి ముందు అయన ట్రెంట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. కంపెనీ విస్తరణకు ఎనలేని కృషి చేశారు. ప్రస్తుతం సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌కు 11వ ఛైర్మన్‌గా, సర్ రతన్ టాటా ట్రస్ట్‌కు ఆరో ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. అయన నాయకత్వంలో ట్రస్ట్‌లు అభివృద్ధి చెంది, వారి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తారనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
టాటాల వంశ వృక్షం
సర్ జంషెడ్‌జీ టాటా.. టాటా గ్రూపును ఏర్పాటుచేసి.. తొలుత ఆయన టెక్స్‌టైల్, స్టీల్ రంగాల్లో ప్రవేశించారు. ఆయన భార్య హీరాబాయి దాదూ.. వారికి దొరాబ్జీ టాటా, ధుంబాయ్ టాటా, సర్ రతన్ టాటా (సీనియర్) ముగ్గురు పిల్లలున్నారు.
సర్ రతన్ టాటా.. నవాజ్‌బాయి సేథ్‌ను వివాహం చేసుకున్నారు. రతన్ చనిపోయాక నావల్ హెచ్ టాటాను నవాజ్‌బాయి ముంబయిలోని ఓ అనాథ ఆశ్రమం నుంచి దత్తత తీసుకున్నారు. సోనూ కమీసరియత్‌తో నావల్ హెచ్ టాటాకు వివాహం జరగ్గా... వారికి రతన్ ఎన్ టాటా, జిమ్మీ ఎన్ టాటా అనే ఇద్దరు పిల్లలు పుట్టారు. రతన్ టాటా పదేళ్ల వయసులో తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. తర్వాత సిమోన్ అనే మరో మహిళను నావల్ హెచ్ టాటా పెళ్లి చేసుకున్నారు. వారికి నోయెల్ టాటా పుట్టారు. ఆయనే ఇప్పుడు టాటా ట్రస్ట్‌ల ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆయన దివంగత సైరస్ మిస్త్రీ సోదరి ఆలూ మిస్త్రీని వివాహమాడారు. నోయెల్ దంపతులకు లీ టాటా, మాయా టాటా, నెవిల్లీ టాటా జన్మించారు.