బెంగళూరులో న్యూజిలాండ్ తో టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆటలో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయంతో బాధపడుతూ మైదానాన్ని వీడాడు. సాయంత్రం సెషన్ లో రవీంద్ర జడేజా బౌలింగ్ లో న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే బ్యాటింగ్ చేస్తుండగా... ఓ బంతిని అందుకునే క్రమంలో పంత్ విఫలమయ్యాడు. అతడి కుడి మోకాలుకు బంతి బలంగా తాకడంతో బాధతో విలవిల్లాడాడు. టీమిండియా ఫిజియో మైదానంలోకి వచ్చి ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ, నొప్పి తగ్గకపోవడంతో పంత్ మైదానాన్ని వీడాల్సి వచ్చింది. దాంతో, పంత్ బదులు ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు. పంత్ గాయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వివరణ ఇచ్చాడు. దురదృష్టవశాత్తు, గతంలో పంత్ కు శస్త్రచికిత్స నిర్వహించిన కాలికే ఇవాళ గాయమైందని వెల్లడించాడు. బంతి నేరుగా అతడి మెకాలి చిప్పకు తగలడంతో, కొద్దిగా వాపు కనిపిస్తోందని తెలిపాడు. పంత్ గాయం విషయంలో తాము రిస్క్ తీసుకోదలుచుకోలేదని, అందుకే అతడిని డ్రెస్సింగ్ రూంకు పంపించామని, గాయం నుంచి కోలుకుని మళ్లీ రేపటి ఆటలో బరిలో దిగుతాడని ఆశిస్తున్నామని చెప్పాడు.