ప్రస్తుతం సొంతింటి కల నెరవేర్చుకునేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు కావాలి. ఇళ్ల ధరలు లక్షలు, కోట్లు పలుకుతున్నాయి. దీంతో తప్పనిసరిగా ఇంటి కోసం రుణం తీసుకోక తప్పడం లేదు. బ్యాంకులు సైతం ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తూ హోమ్ లోన్స్ ఇస్తున్నాయి. తాజాగా 5 ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ కస్టమర్లకు బంపర్ ఆఫర్ తీసుకొచ్చాయి. తక్కువ వడ్డీకే హోమ్ లోన్ ఇవ్వడంతో పాటు ప్రాసెసింగ్ ఫీజులను పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ పండగ సీజన్‌లో హోమ్ లోన్ బిజినెస్ పెంచుకునేందుకు ఈ ఆఫర్లు తీసుకొచ్చినట్లు ఆ బ్యాంక్ వర్గాలు తెలిపాయి.
ప్రాసెసింగ్ ఫీజు 100 శాతం మాఫీ చేసినట్లు ప్రకటించిన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకులు ఉన్నాయి. కొన్ని బ్యాంకులు ఈ ఆఫర్ డిసెంబర్, 2024 వరకు ఇస్తుండగా.. మరి కొన్ని బ్యాంకులు మార్చి, 2025 వరకు జీరో ప్రాసెసింగ్ ఫీ ఉంటుందని తెలిపాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రాసెసింగ్ ఫీ 100 శాతం మాఫీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 రెండో త్రైమాసికంలో 19 శాతం వృద్ధితో రూ.1,849.67 కోట్ల హోమ్ లోన్స్ మంజూరు చేసింది. భారత్‌లో పండగ సీజన్‌లో కొత్త వస్తువులు కొంటుంటారు. ప్రధానంగా ఇళ్ల కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలోనే హోమ్ లోన్ ప్రాసెసింగ్ ఫీ మాఫీ చేస్తున్నట్లు ఇండియన్ ఓవర్సీస్ సీఈఓ, ఎండీ అజయ్ శ్రీవాస్తవా తెలిపారు. ప్రస్తుతం ఉన్న కస్టమర్లతో పాటు కొత్త వారిని ఆకర్షించి బిజినెస్ పెంచేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.
రూ.30 లక్షల వరకు ఉండే గృహ రుణాలపై ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల్లో కనిష్ఠ వడ్డీ రేటు 8.70 శాతంగా ఉంది. అదే ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయానికి వస్తే అంతకన్నా తక్కువగా హోమ్ లోన్స్ ఇస్తున్నాయి. ప్రభుత్వ బ్యాంకుల్లో అత్యల్ప హోమ్ లోన్ వడ్డీ రేటు 8.35 శాతంగా ఉంది. 30 ఏళ్ల టెన్యూర్ వరకు ఆఫర్ కల్పిస్తున్నాయి. హౌసింగ్ సెక్టార్‌లో ప్రధానంగా హోమ్ లోన్స్ విషయంలో రుణాల వితరణ 2022 నుంచి చూస్తే రూ.10 లక్షల కోట్లు పెరిగింది. గత ఆగస్టు నెలలో బ్యాంకుల హోమ్ లోన్లు రూ.18.35 లక్షల నుంచి రూ.28.33 లక్షల కోట్లు ఇచ్చాయి.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
లో హోమ్ లోన్ వడ్డీ రేటు 8.5 శాతం నుంచి 9.5 శాతంగా ఉంది. ఈ బ్యాంక్ 100 శాతం ప్రాసెసింగ్ ఫీ మాఫీ చేసింది. ఈ ఆఫర్ డిసెంబర్ 31, 2024 వరకు ఉంటుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్
8.4 శాతం ఫ్లోటింగ్ రేట్ వడ్డీతో రుణాలు ఇస్తోంది. మార్చి, 2025 వరకు 100 శాతం ప్రాసెసింగ్ ఫీ మాఫీ చేస్తున్నట్లు తెలిపింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా
లో వడ్డీ రేట్లు 8.4 శాతం నుంచి 10.6 శాతంగా ఉన్నాయి. ఈ బ్యాంక్ 100 శాతం ఫీ మాఫీ చేసింది.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు
లో వడ్డీ రేటు 9.35 శాతం నుంచి మొదలవుతోంది. ఈ బ్యాంక్ సైతం 100 శాతం ప్రాసెసింగ్ ఫీ మాఫీ చేసింది.
కెనరా బ్యాంక్
సైతం ప్రాసెసింగ్ ఫీ పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు తెలిపింది.