తాజాగా విడుదలైన ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషబ్ పంత్ అదరగొట్టాడు. విరాట్ కోహ్లీని అధిగమించాడు. మూడు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంక్ దక్కించుకున్నాడు. రన్‌మెషిన్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు. బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో పంత్ 20, 99 పరుగులు చేయడం అతని ర్యాంకు మెరుగు కావడానికి తోడ్పడింది. దీంతో ఇంతకుముందు తొమ్మిదో స్థానంలో ఉన్న అతడు ఇప్పుడు ఆరో ర్యాంక్‌కు చేరాడు. ఇక ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ ఈ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్ మూడో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం టాప్ 10లో ముగ్గురు భారత ప్లేయర్లు ఉండడం విశేషం. కాగా, న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర టాప్-20లోకి దూసుకువచ్చాడు. భారత్‌తో తొలి టెస్టులో శతకం (134), 39 నాటౌట్ రన్స్ చేసిన అతడు 36 స్థానాలు ఎగబాకి ఏకంగా 18వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వే 12 స్థానాలు ఎగబాకి 36వ స్థానానికి చేరుకున్నాడు